దేశంలో చదువు, ఉద్యోగం, శిక్షణలకు దూరంగా 8.7 కోట్ల మంది యువత

దేశంలో చదువు, ఉద్యోగం, శిక్షణలకు దూరంగా 8.7 కోట్ల మంది యువత

భారతదేశంలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం ఎలాంటి చదువు లేదా ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా ఖాళీగా ఉన్నారని  నీతి ఆయోగ్ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2021 లో నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) 78వ రౌండ్ డేటా ఆధారంగా ‘రీఇమైజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ @2047’ పేరుతో నీతి ఆయోగ్ ఈ రిపోర్టును రూపొందించింది. 

స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి, స్థానికంగా డిమాండ్ ఉన్న రంగాలు, భవిష్యత్తులో అభివృద్ధి చెందే, మంచి అవకాశాలు ఉన్న ఇతర రంగాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడానికి సబ్సిడీతో కూడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని తక్షణమే అందించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక నొక్కిచెప్పింది.  చదువు, ఉద్యోగం, శిక్షణ లేని యువతను `నీట్’  పేరుతో ఇక్కడ నీతి ఆయోగ్ నిర్వచించింది. 15 నుంచి 29 మధ్య వయస్కులతో పాటు నిరుద్యోగుల్ని కూడా ఈ కేటగిరీ కింద నీతి ఆయోగ్ వర్గీకరించింది. 

నీతి ఆయోగ్ ప్రకారం ముఖ్యంగా తగిన ఆదాయం లేకపోవడం, గతంలో చదువుల కోసం చేసిన ఖర్చుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న ఆర్థిక భారాల మధ్య మళ్లీ డబ్బులు చెల్లించి నైపుణ్య శిక్షణ పొందడం వారికి సాధ్యపడట్లేదు. ఇంకా తక్కువ రాబడి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కాలేజీ ఖర్చులు, ప్రైవేట్ ట్యూషన్లకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ పరిస్థితుల్లో సాధారణ డిగ్రీతో పాటు డబ్బులు కట్టి అదనంగా స్కిల్ కోర్సులు (నైపుణ్య శిక్షణ) చేయడం వారికి భారంగా మారుతుంది.  ఇంకా డిగ్రీ పూర్తి చేసిన వెంటనే చాలా మంది గ్రాడ్యుయేట్లు (పట్టభద్రులు) తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు తక్కువ జీతమైనా సరే ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోతున్నారని నీతి ఆయోగ్ విచారం వ్యక్తం చేసింది. మరికొందరు ఉద్యోగాలు లభించక ఈ నీట్ యువతగా మిగిలిపోతున్నారని తెలిపింది.

దేశంలో డిగ్రీ పూర్తి చేసిన వారిలో కేవలం 8.25 శాతం మంది మాత్రమే తమ విద్యార్హతకు తగిన ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ లెర్నింగ్‌కు పరిమిత సంఖ్యలో అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ లేకపోవడం వల్ల చదువుకున్న యువతలోనూ ఉద్యోగం సాధించే అర్హత తగ్గడానికి కారణమని తెలిపింది. 

దీంతో నీట్ యువతతో పాటు మహిళలకు తక్కువ ఖర్చుతో కూడిన లేదా పూర్తి సబ్సిడీతో కూడిన శిక్షణా మార్గాలు, ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. సంపాదిస్తూనే చదువుకునే అవకాశాలు కల్పించడం అత్యంత కీలకం అని స్పష్టం చేసింది.