2030 నాటికి రష్యాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం

2030 నాటికి రష్యాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం
రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఇరు దేశాలు తక్షణ చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. మాస్కోలో జరిగిన 27వ భారత్- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంతురోవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో భారత్- రష్యా మధ్య వ్యాపారం నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, ఇదే సమయంలో వాణిజ్య లోటు భారీగా పెరగడంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఆయన చెప్పిన వివరాల ప్రకారం, 2021-22 సమయంలో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 నాటికి దాదాపు 60 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. ఈ వాణిజ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రస్తుతం భారత్ ముందున్న అతిపెద్ద ప్రాధాన్యం అని జైశంకర్ స్పష్టం చేశారు.

ఈ వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు, 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వర్కింగ్ గ్రూప్స్ ముందు జైశంకర్ కీలక సూచనలు ఉంచారు. తదుపరి సమావేశం నాటికి ప్రతి వర్కింగ్ గ్రూప్ సాధించాల్సిన స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రభుత్వాలు నిబంధనల్ని సడలించినా అసలు వ్యాపారం, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన చేసేది ప్రైవేట్ సంస్థలే కాబట్టి పారిశ్రామిక వర్గాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని జైశంకర్ సూచించారు.

వీటికి తోడు ఇంకా పన్నులు, నాన్- టారిఫ్ అడ్డంకుల్ని తొలగించడం, ఇరు దేశాల చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌ను త్వరగా పూర్తి చేయడం ద్వారా వాణిజ్యాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని, అసమతుల్యతను తగ్గించొచ్చని ప్రతిపాదించారు. కాగా, రాబోయే ఎస్ సి ఓ సమిట్‌కు (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్), బ్రిక్స్ సదస్సుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పంపించిన సందేశాన్ని పుతిన్‌కు అందజేశారు.  

ఈ సందర్భంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం పట్ల పుతిన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా భారత్- రష్యా సంబంధాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం కూడా ఇందుకు కారణమని చెప్పారు. భారత వ్యవసాయ రంగానికి, రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాను రష్యా మరింత పెంచుతుందని, అలానే అణు విద్యుత్, హైటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని కొనసాగిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.