పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ ప్రకటించారు. “మార్పు కోసం పంజాబ్ పూర్తిగా సిద్ధంగా ఉంది.ఆ మార్పును సాకారం చేయడానికి బీజేపీ కూడా సంసిద్ధంగా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 117 స్థానాల్లో పోటీ చేసి, విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది,” అని సంతోష్ పేర్కొన్నారు.
పంజాబ్‌లో తన రెండు రోజుల సంస్థాగత పర్యటనలో భాగంగా పాటియాలాలో జరిగిన మొదటి జోనల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశాలు ప్రధానంగా బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విజయాలు, పార్టీ విధానాలను పంజాబ్ ప్రజలకు చేరవేయడంపై దృష్టి సారిస్తాయి.
పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలలో పార్టీ పనితీరును సమీక్షించడం, సంస్థాగత సన్నద్ధత, సమన్వయాన్ని మెరుగుపరచడం, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం. అంతకుముందు, రాష్ట్రంలోని మొత్తం 117 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని చెబుతూ, పొత్తులకు సంబంధించిన ఊహాగానాలను పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ తోసిపుచ్చారు.
ఉదయం చండీగఢ్ విమానాశ్రయంలో ధిల్లాన్, పంజాబ్ బీజేపీ సహ-ఇన్చార్జ్ నరేంద్ర సింగ్ రైనా ఆయనకు స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ నాయకులు, సంస్థాగత బాధ్యులతో జోనల్ సమావేశాలు నిర్వహించడం ద్వారా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలను సంతోష్ సమీక్షించనున్నారు.
సోమవారం నాడు ఆయన పాటియాలా, భటిండాలో జరిగే సమావేశాలకు అధ్యక్షత వహించారు. పాటియాలా సమావేశంలో మొహాలి, పాటియాలా నార్త్, పాటియాలా అర్బన్, పాటియాలా సౌత్, ఫతేగఢ్ సాహిబ్, సంగ్రూర్ ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా భటిండా సమావేశం బర్నాలా, మాన్సా, భటిండా రూరల్, భటిండా అర్బన్, ముక్త్సర్ సాహిబ్, ఫాజిల్కా, ఫరీద్కోట్ ప్రాంతాలను కవర్ చేసింది.
“విద్యా విప్లవం” తీసుకువస్తామన్న హామీని నెరవేర్చడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని, అలాగే వారి “ఆరోగ్య విప్లవం” పూర్తిగా విఫలమైందని బీజేపీ పేర్కొంది. “ఒక్క కొత్త ఆసుపత్రి కూడా ప్రారంభించలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది. మాఫియా రాజ్యం నడుస్తుంది. పంజాబ్ నిర్లక్ష్యానికి గురైంది. పైగా రాష్ట్ర అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి” అని బీజేపీ వ్యాఖ్యానించింది.

More Stories
`ఒకే దేశం, ఒకే ఎన్నిక’కు 99 శాతం మంది మద్దతు
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై సాధువులు అవగాహన కల్పించాలి
చండీగఢ్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు పట్టివేత