కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో జరిగిన లక్షిత హత్యలకు సంబంధించిన, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా, జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) 1998 నాటి వాంధమా ఊచకోత కేసుపై దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. ఇందులో 23 మంది కాశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారు.
ప్రముఖ కాశ్మీరీ పండిట్ నాయకుడు టికా లాల్ తప్లూ, జస్టిస్ నీలకంఠ గంజూ హత్యలకు సంబంధించిన దర్యాప్తును కూడా ఈ ఏజెన్సీ ముమ్మరం చేసింది. కాశ్మీరీ పండిట్ నర్సు సరళా భట్, రచయిత సర్వానంద్ కౌల్ ప్రేమి, ఆయన కుమారుడు వీరేందర్ కౌల్ కేసులలో ఇటీవల తీసుకున్న చర్యల తర్వాత ఈ తాజా దర్యాప్తు ప్రక్రియ మొదలైంది.
వాంధమా ఊచకోత,తప్లూ హత్యకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా, కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఏ సోదాలు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను, వారికి సహకరించిన ఇతరులను గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు.
1998 జనవరి 25న గందర్బల్ జిల్లాలోని వాంధమా గ్రామంలో భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ కుటుంబాల ఇళ్లలోకి చొరబడినప్పుడు ఈ వాంధమా ఊచకోత జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది మహిళలు, నలుగురు పిల్లలతో సహా మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు రాత్రి, అలాగే ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్‌లోని అత్యంత పవిత్రమైన రాత్రులలో ఒకటైన ‘షబ్-ఎ-ఖద్ర్’ రాత్రి వేళ ఈ హత్యలు జరిగాయి.
జూన్‌లో, 1990 నాటి సరళా భట్ హత్య కేసులో 737 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో జైలులో ఉన్న జేకేఎల్ ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను ఈ ఘటనకు సూత్రధారిగా పేర్కొన్నారు. కాశ్మీరీ పండిట్ రచయిత సర్వానంద్ కౌల్ ప్రేమి, ఆయన కుమారుడు వీరేందర్ కౌల్ హత్యలకు సంబంధించి, ఆగస్టు నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఆ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది.
ప్రముఖ న్యాయవాది, అప్పటి జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఉపాధ్యక్షుడైన టికా లాల్ తప్లూను 1989 సెప్టెంబరులో శ్రీనగర్‌లోని తన నివాసం సమీపంలో కాల్చి చంపారు.
కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెరిగిన సమయంలో ప్రముఖ కాశ్మీరీ పండిట్లపై జరిగిన తొలి లక్షిత హత్యలలో ఆయన హత్య ఒకటి. అలాగే, జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది మక్బూల్ భట్‌కు మరణశిక్ష విధించిన నీలకంఠ గంజూ కూడా లక్ష్యంగా మారారు. జస్టిస్ గంజూను 1989 నవంబరు 4న శ్రీనగర్‌లోని హరి సింగ్ వీధిలో అనుమానిత జెకెఎల్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో కాల్చి చంపారు.

More Stories
శతాబ్దానికిపైగా ఎన్నడూ లేనంతగా ఎల్‌నినో ప్రభావం
అమరావతి ఆసుపత్రిలో మంటల్లో ముగ్గురు నవజాత శిశువులు మృతి
లడఖ్‌లో జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు బెంచ్