ఢిల్లీలో ఆంక్షలపై `సుప్రీం’కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణ

* ఉద్దేశపూర్వక ఉల్లంఘన లేదని స్పష్టం 
 
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనల సమయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ధిక్కరిస్తూ మొబైల్ ఇంటర్నెట్‌ను బంద్ చేశారనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. అయితే, కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాలనే ఉద్దేశం తమకు లేదని, నాటి అత్యవసర భద్రతా పరిస్థితుల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంటూ ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు.
 
అవసరమైన అనుమతి లేకుండా ప్రతిపాదిత నిరసన జరగనుందని, అలాగే నీట్ పేపర్ లీక్‌పై జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రజా భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా నిరోధించడానికి కేంద్రం అక్టోబర్ 9న ఆంక్షలు విధించిందని తెలిపారు. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తన అఫిడవిట్‌లో ఆనాటి పరిణామాలను సమగ్రంగా వివరించారు. 
 
అక్టోబర్ 10వ తేదీన ఢిల్లీలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందన్న భయంతో 24 గంటల పాటు సెల్యులర్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాజధాని నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటానికి, ముందస్తు జాగ్రత్త చర్యగా వారి విజ్ఞప్తిని ఆమోదించడం సరైన చర్య అని భావించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.

అక్టోబర్ 9వ తేదీ రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు దాదాపు 24 గంటల కాలపరిమితితో రైసినా హిల్స్ పరిసర ప్రాంతాలైన 4 కిలో మీటర్ల పరిధిలోనే ఈ ఆంక్షలు అమలు చేశామని చెప్పారు. ప్రజలకు పూర్తిస్థాయిలో ఇబ్బంది కలగకుండా కేవలం సెల్యులర్ డేటాను మాత్రమే నిలిపి వేశామని, వైఫ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి టెలీకమ్యూనికేషన్ నిషేధాలు విధించలేదని అత్యున్నత ధర్మాసనానికి వివరించారు.  తనపై ఉన్న ధిక్కార చర్యలను ఉపసంహరించుకోవాలని మోహన్ సుప్రీంకోర్టును కోరారు.

అలాగే, నిలిపివేతలు చట్టబద్ధమైన రక్షణలకు అనుగుణంగా ఉన్నట్లయితే, అవసరమని భావించినప్పుడు ఇంటర్నెట్ షట్‌డౌన్‌లకు అనుమతించేలా తన అక్టోబర్ 11 నాటి ఉత్తర్వును సవరించాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. మరోవైపు సీజేపీ పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శనలకు అనుమతి నిరాకరించడం వెనుక ఉన్న బలమైన కారణాలను ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ తమ అఫిడవిట్‌లో తెలిపారు. గతంలో జులై 20వ తేదీన నిర్వహించిన ఆందోళనల సమయంలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. 


About The Author