అమరావతి ఆసుపత్రిలో మంటల్లో ముగ్గురు నవజాత శిశువులు మృతి

అమరావతి ఆసుపత్రిలో మంటల్లో ముగ్గురు నవజాత శిశువులు మృతి
సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలోని నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు శిశువులు మరణించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా ఆసుపత్రిలో ‘వార్మర్’ (శిశువులకు వెచ్చదనాన్నిచ్చే పరికరం) వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో ఒక నవజాత శిశువు మరణించి, మరో ఇద్దరు గాయపడిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
దీంతో కేవలం 48 గంటల వ్యవధిలో ఈ రెండు ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనల్లో మరణించిన శిశువుల సంఖ్య నాలుగుకు చేరింది. అమరావతి ఆసుపత్రి మూడవ అంతస్తులో ఉన్న  ఎన్ఐసియు  లోని ఒక వెంటిలేటర్ అకస్మాత్తుగా పేలడంతో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎన్ఐసియులో సుమారు 39 మంది నవజాత శిశువులు ఉన్నారు. 
 
విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వెంటనే శిశువులను ఆ యూనిట్ నుండి బయటకు తరలించడం ప్రారంభించారు. శిశువులను రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు శిశువులు మరణించారు. మరో ఆరుగురు నవజాత శిశువులను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, మరణాలకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 
జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ కాంచన్ దూబే తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన అర్ధరాత్రి సుమారు 1:50 గంటల సమయంలో జరిగింది. ఎన్ఐసియులో ఉపయోగించే ఒక వార్మర్ ఫిలమెంట్‌లో వచ్చిన నిప్పురవ్వ కారణంగా ఆ పరికరానికి మంటలు అంటుకోవడంతో, ముగ్గురు నవజాత శిశువులకు కాలిన గాయాలయ్యాయి.  
 
అమరావతి జిల్లా సంరక్షక మంత్రి, రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే మృతుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గాయపడిన శిశువులకు అందిస్తున్న వైద్య చికిత్సను పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని జిల్లా అధికారులను కోరారు.
 
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బారామతి ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ఆమె ‘ఎక్స్’  వేదికగా మరాఠీలో ఇలా రాశారు: ” ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన. తల్లీదండ్రులు తమ బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు, కానీ అటువంటి బిడ్డను ఇలా కోల్పోవడం… వారికి ఎంతటి వేదన కలిగి ఉంటుందో ఊహించలేము. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, వ్యవస్థలోని నిర్లక్ష్యానికి ఒక స్పష్టమైన ఉదాహరణ”.