అమరావతి నుండి ఖరగ్‌పుర్‌ హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌

అమరావతి నుండి ఖరగ్‌పుర్‌ హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌
ఉత్తరాంధ్ర నుంచి అమరావతి వరకు ప్రయాణానికి కొత్త దారి సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ను అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానించే నాలుగు వరుసల హైస్పీడ్‌ కారిడార్‌కు ఏపీ పరిధిలోని 457 కి.మీ. ఎలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.32 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ జాతీయ రహదారి గిరిజన ప్రాంతాలు, గోదావరి జిల్లాలు, అమరావతిని వేగవంతమైన రహదారి మార్గంతో కలపనుంది.

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు కొత్తగా నిర్మించనున్న నాలుగు వరుసల హైస్పీడ్‌ రహదారి కారిడార్‌కు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఎలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 457 కి.మీ. మార్గాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌)లోని ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ (ఏఏసీ) రూ.32 వేల కోట్ల అంచనాతో ఆమోదించింది. 

పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా మొత్తం 1,107 కి.మీ. మేర ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఈ హైస్పీడ్‌ కారిడార్‌ కలవనుంది.

గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్‌ ఉంటుంది.  ఈ రహదారి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల మీదుగా వెళ్తుంది. దీంతో ఆయా జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంయుక్త కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వంటి అధికారుల్లో ఎవరినైనా భూసేకరణ అధికారి (కాలా)గా నియమించనున్నారు. 

మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు అధికారులను ఎంపిక చేసి గెజిట్‌ జారీ కోసం మోర్త్‌ ఉన్నతాధికారులకు వివరాలు పంపించారు. మిగతా జిల్లాల అధికారుల పేర్లను ఈ వారంలో పంపనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్​ను మంజూరు చేయడం పై కేంద్రం దృష్టి పెట్టంది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఎలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చిన తర్వాత డీపీఆర్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే మార్చి నాటికి ప్రాజెక్ట్​ను మంజూరు చేయాలని భావిస్తున్నారు.