* వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ ఏడు ప్రాంతాల్లో దాడులు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిసారి రంగప్రవేశం చేసింది. శుక్రవారం ఏకకాలంలో హైదరాబాద్‌లోను, కడప జిల్లాలోనూ ఏడు చోట్ల ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇళ్ల్లతో పాటు వివేకా హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది.
అవినాశ్‌రెడ్డి ఇంట్లో రూ.24 లక్షల నగదు, రెండు లాకర్ల తాళాలను, కొన్ని కీలక పత్రాలను, డిజిటల్, ఎలకా్ట్రనిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు సుమారు 40 మంది ఏకకాలంలో పులివెందుల బాకరాపురంలోని ఎంపీ అవినాశ్‌రెడ్డి, జయమ్మ కాలనీలోని దస్తగిరి, మైత్రి లేఅవుట్‌లో ఉంటున్న సునీల్ యాదవ్, సుజాత థియేటర్ వెనుక ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తొండూరు మండలం టి.తుమ్మలపల్లెలోని ఎర్ర గంగిరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
అయితే ఆ సమయంలో అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఇళ్లలో లేరు. ఎంపీ ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన చిన్నాన్న మనోహర్‌రెడ్డి వచ్చి తాళం తీయడంతో అధికారులు లోపలకు వెళ్లారు. దాదాపు ఆరున్నర గంటలు తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో అవినాశ్‌రెడ్డి నివాసంలోనూ 8 గంటలు సోదాలు నిర్వహించారు.
బ్యాంకు ఖాతాలు, ఆర్ధిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులను పరిశీలించి కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని మైహోమ్ అవతార్‌లో శివశంకర్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపి కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దస్తగిరి ఇంట్లో కూడా దాదాపు 7 గంటల పాటు విచారణ చేపట్టి పలు వివరాలను రాబట్టడమే గాక 1400 పేజీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఈనెల 8వ తేదీన భారత రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. హత్య జరిగి ఏడేళ్లు గడుస్తున్నా కొన్ని కీలక అంశాల చిక్కుముడి వీడలేదని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని, డబ్బు మూలాలు, మనీ ట్రయల్, హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర, కీలక వ్యక్తుల కదలికలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అందులో తెలిపారు.
తమ దర్యాప్తులో మనీ ట్రయల్‌కు సంబంధించి కొన్ని కీలక విషయాలు గుర్తించినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనల ప్రకారమే తనిఖీలు చేపట్టామని పేర్కొంది.

More Stories
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
బిజెపి శ్రేణులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి