“ప్రపంచ ఫార్మసీ” నుండి “ప్రపంచ ప్రయోగశాల”గా ఆవిర్భవించాలి 

“ప్రపంచ ఫార్మసీ” నుండి “ప్రపంచ ప్రయోగశాల”గా ఆవిర్భవించాలి 
భారతదేశం “ప్రపంచ ఫార్మసీ” అనే తన గుర్తింపును అధిగమించి, పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా “ప్రపంచ ప్రయోగశాల”గా ఆవిర్భవించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు.  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఏ)లో “ఆరోగ్య సంరక్షణలో ఏఐని పురోగమింపజేయడం” అనే అంశంపై జరిగిన ఐఐఎంఏ హెల్త్‌కేర్ సమ్మిట్ 2026 మూడవ ఎడిషన్‌లో ప్రసంగిస్తూ, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశం పోషించిన పాత్రను  ప్రముఖంగా ప్రస్తావించారు. 
 
దేశంలోని ఫార్మాస్యూటికల్ పరిశ్రమ 200కు పైగా దేశాలకు వ్యాక్సిన్‌లు, అవసరమైన వైద్య ఉత్పత్తుల సరఫరాను నిరంతరాయంగా అందేలా చూసిందని ఆమె గుర్తు చేశారు. భారత్కరోనా  వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 2.2 బిలియన్లకు పైగా డోసులు వేసినట్లు ఆమె తెలిపారు.  ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ (ఏఐ) పరివర్తనాత్మక సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఏఐ ఔషధాల ఆవిష్కరణను వేగవంతం చేయగలదని, వ్యక్తిగతీకరించిన చికిత్సను అందించగలదని, మెరుగైన స్క్రీనింగ్, వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వ్యాధి నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయగలదని పటేల్ పేర్కొన్నారు. 
 
అయితే, రోగి గోప్యతకు పటిష్టమైన రక్షణలు కల్పిస్తూ, ఏఐ  వినియోగం సురక్షితంగా, బాధ్యతాయుతంగా, మానవ-కేంద్రీకృతంగా ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. “ఏఐ, మానవ వైద్యపరమైన నిర్ణయాలను భర్తీ చేయకూడదు, వాటికి పూరకంగా ఉండాలి,” అని ఆమె చెప్పారు. పైలట్ ప్రాజెక్టుల నుండి జనాభా స్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు సాగడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, స్టార్టప్‌లు,  పరిశ్రమల మధ్య మరింత సహకారం ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
పరిశోధన, పరిశ్రమ-విద్యాసంస్థల సహకారాన్ని బలోపేతం చేయడానికి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి దిశగా భారతదేశ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన, ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల ప్రోత్సాహం  కోసం ప్రభుత్వం కేటాయించిన రూ. 5,000 కోట్ల పథకాన్ని కూడా మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 
దేశీయ బయోఫార్మాస్యూటికల్ వ్యవస్థకు మద్దతుగా, బయోలాజిక్స్, బయోసిమిలర్స్‌లో సామర్థ్యాలను బలోపేతం చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, నియంత్రణ, క్లినికల్ ట్రయల్ సామర్థ్యాలను పెంచడం లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి మిషన్‌ను కూడా ఆమె ప్రస్తావించారు. 
 
ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ, పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉత్పత్తి, మానవ వనరులు, మార్కెటింగ్, పంపిణీ, ఇన్వెంటరీ నిర్వహణ వంటి రంగాలలో ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయని, అదే సమయంలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు ఔషధ ఆవిష్కరణ కోసం ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయని తెలిపారు.