* రూ. 150 కోట్ల ట్రస్ట్ నిధుల బదిలీపై ప్రశ్నలు
నల్సార్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల వివాదం నేపథ్యంలో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) పనితీరులో తీవ్రమైన అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ సంస్థ కో-చైర్మన్ వైఆర్ సదాశివ రెడ్డి చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాను డిమాండ్ చేశారు. దీంతో మిశ్రా రాజీనామా చేయాలన్న డిమాండ్ మరింత బలపడింది. నియామకాలు, నిధుల నిర్వహణ, నియామక ప్రక్రియలు, లా కాలేజీలకు అనుమతులు, న్యాయ విద్యార్థులకు సంబంధించిన నిర్ణయాలపై వచ్చిన వరుస ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని రెడ్డి ఆరు పేజీల లేఖలో కోరారు.
15 రోజుల్లోగా మిశ్రా తన పదవికి రా జీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిశ్రాపై ఆరోపణలకు సంబంధించి చర్చించేందు కు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆయన కోరారు. బిసిఐ అనేది ఏ ఒక్క వ్యక్తికీ చెందిన ప్రైవేట్ సంస్థ కాదని, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ అని రెడ్డి నొక్కి చెప్పారు. లక్షలాది మంది న్యాయవాదుల ప్రయోజనాలు, న్యాయ వృత్తిలోకి ప్రవేశానికి సంబంధించిన కీలక అధికారాలు ఈ సంస్థ పరిధిలో ఉంటాయని ఆయన గుర్తుచేశారు.
రెడ్డి లేవనెత్తిన అంశాలలో బిసిఐలో జరిగిన నియామకాలు ఒకటి. స్పష్టమైన నియామక ప్రక్రియ లేకుండానే పలువురిని నియమించారని ఆయన ఆరోపించారు. నియామక ప్రకటనలు, ఎంపిక కమిటీల వివరాలు లేదా మెరిట్ జాబితాల వంటి సమాచారం తనకు అందించలేదని రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా, బిసిఐలోని పలువురు ఉద్యోగులకు చైర్మన్‌తో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, కొందరు ఆయన కుటుంబ సభ్యులు లేదా బంధువులేనని ఆయన ఆరోపించారు. నియామక ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని, సంబంధిత రికార్డులను బహిర్గతం చేయాలని రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, మిశ్రా ఎంపిక చేసిన ట్రస్టీలతో 2020లో ‘బీసీఐ ట్రస్ట్ పెరల్ ఫస్ట్’ అనే కొత్త ట్రస్టును నమోదు చేశారని, బీసీఐ నిధుల నుంచి రూ. 150 కోట్లను ఈ ట్రస్టుకు బదిలీ చేయడానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆ తీర్మానాన్ని తనతో పాటు ఇతర సభ్యులు అభ్యంతరం చెప్పినట్టు తెలిపారు. బిసిఐ సభ్యులకు ఇప్పటికీ ఆ ట్రస్ట్ గురించి పూర్తి సమాచారం లేదా ట్రస్ట్ డీడ్ (ఒప్పంద పత్రం) కాపీని అందించలేదని ఆయన ఆరోపించారు. అందువల్ల, వీటి ఖాతాలపై స్వతంత్ర ఆడిట్ జరపాలని రెడ్డి కోరారు.
లా కాలేజీలకు అనుమతులు మంజూరు చేయడం, వాటిని పొడిగించడం అనే అంశంపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. అనుమతి కోరుతున్న కొత్త లా కళాశాలలు, అనుమతి పొడిగింపు కోరుతున్న ప్రస్తుత కళాశాలల నుండి రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షలు, అలాగే రూ. కోటి వరకు “విరాళాలు” ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పలు రాష్ట్రాల నుండి ఫిర్యాదులు అందాయని రెడ్డి తెలిపారు.
ఈ ఫిర్యాదులు నిజమని తేలితే అది అత్యంత తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు. లా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేదా వాటి యాజమాన్యాల నుండి ఏ రూపంలోనైనా డబ్బు వసూలు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, తనపై వస్తున్న ఆరోపణలను బీసీఐ చైర్మన్ పవన్‌కుమార్ మిశ్రా ఖండించారు. సదాశివరెడ్డి రాసిన లేఖలో ఆరోపణలన్నీ రాజకీయ కక్షతో చేసినవేనని స్పష్టం చేస్తూ అసలు ఆయన బీసీఐ కో-చైర్మన్ కూడా కాదని పేర్కొన్నారు. ఇవాళ ఆయన స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు కూడా కాదని తెలిపారు. కర్ణాటక స్టేట్ బార్ కౌన్సిల్‌కు సదాశివరెడ్డి పోటీ చేయలేదని, బార్ కౌన్సిల్ ఫలితాలు కూడా వెలువడ్డాయని చెప్పారు.
బీసీఐ పార్లమెంటు చట్టం కింద ఏర్పడిందని, చైర్మన్ పదవీకాలంపై ఎలాంటి పరిమితి విధించలేదని మిశ్రా చెప్పారు. ఆ చట్ట ప్రకారమే ఆరుసార్లు తాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా 25 లక్షల మంది లాయర్లు తనను ఎన్నుకున్నారని చెప్పారు. 12 నుంచి 14 ఏళ్లుగా తాను ఎన్నికైన బీసీఐ చైర్మన్‌గా సేవలందిస్తున్నానని, పదవి నుంచి తప్పుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు.

More Stories
పార్టీ బలోపేతంకై కొత్త ఆలోచనలు, దృక్పధాలు.. మోదీ
పునరుత్పాదక ఇంధనంతో బొగ్గు అనుసంధానం ముఖ్యం
డార్జిలింగ్ సమస్యకు “శాశ్వత రాజకీయ పరిష్కారం”కై కమిటీ