రేవంత్ అమెరికా పర్యటన అనుమతిపై అనవసర రాద్ధాంతం

రేవంత్ అమెరికా పర్యటన అనుమతిపై అనవసర రాద్ధాంతం
ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతుల నిరాకరణపై కాంగ్రెస్ అనవసర రాజకీయ రాద్ధాంతం చేయడం మానుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాoచందర్‌రావు హితవు చెప్పారు. రేవంత్ ప్రతినిధి బృందానికి పెట్టుబడుల సమావేశాలకు అనుమతులు ఇచ్చినా రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఏ) పొలిటికల్ క్లియరె న్స్ ఇవ్వకపోవడం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
సీఎంతో పాటు వెళ్లే అధికారుల ప్రతినిధి బృందానికి పెట్టుబడులు, ఒప్పందాల కోసం సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.  రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆ పర్యటన అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సం స్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రోటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.
 
ఇకపోతే గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012లో నాటి అస్సాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ అమెరి కా, ఇజ్రాయెల్ పర్యటనలను, అదేవిధంగా జార్ఖండ్‌కు బిజెపి సీఎం అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు కుట్రపూరితంగా లేఖలు రాసిన చరిత్రను ఉందని ఆయన దుయ్యబట్టారు. 
 
సిఎం రేవంత్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, తాజా పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల లోపాల ప్రకారమే నిర్ణయం జరిగిందని, దీనిని రాజకీయం చేయవద్దని రాంచందర్‌రావు హెచ్చరించారు. 
 
కాగా, నీట్ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబిబిఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల కోర్సు ఫీజును ఐదు వాయిదాలలో చెల్లించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టిఏఎఫ్‌ఆర్‌సి) నిర్దేశించినప్పటికీ, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.13 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అదనపు భారం మోపాయని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వాపస్ చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డితో పాటు హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పులిచ్చాయని ఆయన గుర్తు చేశారు.