హైదరాబాద్‌లో బయటపడ్డ 400 ఏళ్ల నాటి సొరంగం

హైదరాబాద్‌లో బయటపడ్డ 400 ఏళ్ల నాటి సొరంగం
హైదరాబాద్‌లోని చారిత్రక కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో రహస్య సొరంగం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు జరిగినట్లు సమాచారం రావడంతో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ), పోలీసులు రంగంలోకి దిగారు. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని క్రీడా మైదానం సమీపంలో ఈ నిర్మాణం బయటపడినట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నిర్మాణం నిజంగా పురాతన సొరంగమేనా? అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? దాని నిర్మాణం ఏ కాలానికి చెందింది? అనే అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.   ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం, రెవెన్యూ శాఖ, భారత సైన్యంతో కలిసి ఆ ప్రదేశంలో సంయుక్తంగా సర్వే నిర్వహించింది.
నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, దాని నిర్మాణ శైలి, ఉపయోగించిన రాళ్లు వంటి అంశాలను పరిశీలించి అది నిజంగా కుతుబ్‌షాహీల కాలం నాటి నిర్మాణమా అనే విషయాన్ని నిర్ధారించే అవకాశం ఉంది.  మరోవైపు ఘటనాస్థలంలో భద్రత కోసం పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా తవ్వకాలు ఎవరు చేపట్టారు? ఎందుకు చేపట్టారు? తవ్వకాల వెనుక ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.   
 
హైదరాబాద్‌ చరిత్రలో గోల్కొండ కోట నుంచి చార్మినార్‌ ప్రాంతం వరకు రహస్య మార్గాలు ఉన్నాయనే కథనాలు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి. 
అత్యవసర పరిస్థితుల్లో రాజకుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు ఇలాంటి మార్గాలను ఉపయోగించేవారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సుల్తాన్‌ మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కాలానికి సంబంధించిన అనేక కథనాల్లో ఈ రహస్య మార్గాల ప్రస్తావన కనిపిస్తుంది. 
 
అయితే గోల్కొండ నుంచి చార్మినార్‌ వరకు సొరంగం ఉందనే ప్రచారానికి ఇప్పటివరకు కచ్చితమైన పురావస్తు ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.  హైదరాబాద్‌ ప్రాంతంలోని రాతి నేల స్వభావం, ఆ కాలంలోని నిర్మాణ సాంకేతికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇంత భారీ దూరంలో సొరంగం నిర్మాణంపై మరింత శాస్త్రీయ పరిశోధన అవసరమని తెలుస్తోంది. 
 
ఇదే సమయంలో గోల్కొండ కోట పరిధిలోని పటాన్‌చెరు దర్వాజా సమీపంలోని ‘అఠారా సీడీ’ ప్రాంతంలో కూడా చిన్న గుహలాంటి నిర్మాణం కనిపించిందన్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిగాయంటూ స్థానిక ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ ఆరోపించినట్లు సమాచారం.  అయితే అక్కడ బయటపడిన నిర్మాణాన్ని నిజంగా సొరంగంగా పరిగణించవచ్చా లేక మరేదైనా పురాతన నిర్మాణ అవశేషమా అనే అంశాన్ని పురావస్తు నిపుణులు తేల్చాల్సి ఉంది.