ఉచితాలకోసం అప్పులు చేస్తూ పరిహారాలు, జీతాలు చెలించరే?

ఉచితాలకోసం అప్పులు చేస్తూ పరిహారాలు, జీతాలు చెలించరే?
ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే చెల్లింపుల ప్రాధాన్యతను స్పష్టంగా చూపాల్సి ఉంటుందని పేర్కొంటూ జీతాలు, పరిహారాలు చెల్లించకుండా సంక్షేమకార్యక్రమాలకోసం అంటూ ఉచిత పథకాలపై అప్పులు చేసిమరీ నిధులు ఖర్చు చేస్తుండటం పట్ల తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. 
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవని, అయితే ప్రజల హక్కులకు సంబంధించిన చెల్లింపుల విషయంలో ప్రాధాన్యత క్రమాన్ని ప్రశ్నించాల్సి వస్తోందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన బాధితులు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు, పెన్షన్ బకాయిల కోసం కూడా ఉద్యోగులు న్యాయస్థానాల మెట్లెక్కుతున్నారని పేర్కొంది. 
 
కనీస వేతనాలతో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు సైతం జీతాలు అందని పరిస్థితులు ఉన్నాయని ప్రస్తావించింది. చెల్లింపుల విషయంలో పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. నీటి భూసేకరణ పరిహారం చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీఓలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. 
 
ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ భూసేకరణ పరిహారానికి సంబంధించి 19 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో మూడు కేసుల్లో టోకెన్లు జారీ అయ్యాయని తెలిపారు.  మిగిలిన కేసుల వివరాలను సమర్పించేందుకు గడువు కోరారు. పథకాలపై స్టే ఎత్తివేయాలని, దానికి సంబంధించి కౌంటర్, వేకేటింగ్ పిటిషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. 
 
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం రుణాలు తీసుకుందా? రాష్ట్ర మొత్తం అప్పు ఎంత? ఇతర చెల్లింపులతో పోలిస్తే ఈ పథకాలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే అంశాలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భూసేకరణ పరిహారం చెల్లింపులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల వివరాలను ప్రతి కేసుకు విడిగా సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. 
 
విచారణలో భాగంగా బిసి సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను తప్పుగా ఉటంకించిన విషయం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. ఆర్టికల్ 162 పేరుతో అసలు రాజ్యాంగ నిబంధనకు భిన్నమైన వివరణను ఎలా పేర్కొన్నారని ప్రశ్నించారు. ఇది సాధారణ తప్పిదంగా తీసుకోలేమని, రాజ్యాంగంలోని ఒక అధికరణాన్ని అధికారిక అఫిడవిట్‌లో తప్పుగా పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
సంతకం చేసే ముందు కనీసం పరిశీలించరా? అని ప్రశ్నించారు. దీనిపై ఏఏజి స్పందిస్తూ ఇది పొరపాటుగా జరిగిందని, సరిదిద్దుతామని తెలిపారు. అయితే ఈ అంశంపై వివరణతో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే మిగిలిన విషయాలను పరిశీలిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు సమర్పించిన వినతిపత్రంలోని అంశాలను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 
 
నాలుగు పిఆర్‌సిలు, ఆరు డిఏలు అందలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పరిశీలనకు నవీన్ మిట్టల్ నేతృత్వంలో సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్‌బినగర్‌లో ఐదు కోట్ల బిల్లు చెల్లించకపోవడంతో ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశాలకు ప్రస్తుత పిటిషన్‌తో సంబం ధం ఏమిటో స్పష్టంగా చూపకుండా వాటిని పరిశీలించలేమని న్యాయమూర్తి పేర్కొన్నా రు. 
 
ఈ సందర్భంగా ఏఏజీ కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యాఖ్యలను సా మాజిక మాధ్యమాలు, టివి చర్చలు, రాజకీయ వేదికల్లో చేసుకోవచ్చుగానీ కోర్టులో చేయకూడదని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ప్రస్తుత విచారణ ఏ రాజకీయ పార్టీ, వ్యక్తికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. 2014 నుంచి పథకాల అమలుతీరును సమీక్షిస్తున్నామని, చర్చ పూర్తిగా చట్టబద్ధమైన అంశాలకే పరిమితమని తెలిపారు.
 
ప్రజల హక్కులకు సంబంధించిన అంశాల్లో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని చెల్లింపుల్లో సమతుల్యత అవసరమని వ్యాఖ్యానించింది. బిసి సంక్షేమశాఖతోపాటు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.