భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. నాలుగు తరాల ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులను చేసిన అలనాటి ప్రముఖ సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (94) తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె మరణవార్తతో తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో డిసెంబర్ 12, 1931న జన్మించిన శంకరమంచి జానకి (అసలు పేరు) రంగస్థల నటిగా తన కళా జీవితాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత రేడియో నాటికల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 1950లో ఎన్టీఆర్ సరసన విడుదలైన సరికొత్త సంచలన చిత్రం ‘షావుకారు’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మొదటి చిత్రంతోనే ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో, ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆమె తల్లి దండ్రులు శచీదేవి, టేకుమళ్ళ వెంకోజీరావు. తండ్రి రాజమండ్రిలో గవర్నమెంట్ పేపరు ఎక్స్ పర్టు అండ్ కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవారు.
ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళు. వారిలో ఒకరు ప్రముఖ నటి కృష్ణ కుమారి. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె అసాధారణ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 400లకు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. వీటిల్లో 200లకు పైగా సినిమాల్లో కథానాయికగానే మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, డాక్టర్ రాజ్‌కుమార్‌ల సరసన నటించి ఆనాటి మేటి తారగా వెలిగారు.
తమిళంలో 1952లో ‘వలయపతి’తో అడుగుపెట్టి అక్కడ కూడా అగ్ర తారగా ఎదిగారు. 1959లో డాక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మహిషాసుర మర్దిని’ కన్నడ చిత్రసీమ తొలి పాన్-ఇండియా చిత్రంగా నిలిచింది. మలయాళంలో ‘స్కూల్ మాస్టర్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. బహుభాషా ప్రావీణ్యం కలిగిన జానకి ఇతర భాషల్లోనూ తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఆమె చివరగా 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో కనిపించారు.
‘షావుకారు’ జానకి పేరు వినగానే ముందుగా ఆమె గళం గుర్తుకు వస్తుంది. గాయని కాకపోయినా, ఆమె గాత్రం నుండి జాలువారిన మాటలు వినసొంపుగా ఉండేవి. ఆ గళమహిమతోనే చిత్రసీమలో జైత్రయాత్ర చేశారు జానకి. విజయా సంస్థ ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో నిర్మించిన ‘షావుకారు’ చిత్రంతో చిత్రసీమలో అడుగు పెట్టిన జానకి, నాటి మేటి నటీనటుల సరసన తొలి సినిమాతోనే దీటుగా నటించి భళా అనిపించుకున్నారు జానకి. అందువల్లే ‘షావుకారు’ టైటిలే జానకి ఇంటిపేరుగా మారింది.
పాత్ర ఏదైనా సరే ఇట్టే పరకాయ ప్రవేశం చేయడం షావుకారు జానకి నైజం. తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయడానికే తపించారు జానకి – ఇది నిజం. భక్తిరస పాత్రలు పోషించే సమయంలో జానకి ఎంతో నిష్టగా ఉండేవారు. ఆ పాత్రలను రక్తి కట్టించేవారు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. తమిళ చిత్రాలలోనే ఎక్కువగా హీరోయిన్ వేషాలు వేశారు.
కొన్ని పాత్రల్లో జానకిని తప్ప ఇతరులను ఊహించుకోలేం. ‘మంచి మనసులు’లో అంధురాలిగా ఆమె నటించిన వైనాన్ని మరచిపోలేం. తన సొంత చెల్లెలు కృష్ణకుమారి ఆగమనంతో జానకికి తెలుగులో నాయిక పాత్రలు తగ్గాయి. అయినా వెరవలేదు. తన మనసుకు నచ్చిన కేరెక్టర్ దొరికితే చాలు ఎంతో పొంగిపోయేవారు జానకి. పలు చిత్రాల్లో బరువైన పాత్రలు పోషించి మెప్పించారు జానకి.
‘కన్యాశుల్కం’లో బుచ్చమ్మ పాత్రలో జానకి వెండితెరపై జీవించారు. ఇక ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లో ఎరుకల సానిగా జానకి అభినయాన్ని ఈ నాటికీ జనం మరచిపోలేదు. వయసు మీద పడ్డా అందుకు తగ్గ పాత్రల్లో షావుకారు జానకి తనదైన బాణీ పలికించారు. యాభై ఏళ్ళు దాటాక కూడా ‘తాయారమ్మ- బంగారయ్య’ చిత్రంలో జానకి అభినయించిన తీరు చూసి ఆ నాటి యంగ్ హీరోయిన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ‘తాయారమ్మ’గా జానకి నటన ప్రేక్షకులను ఎంతగానో రంజింప చేసింది.

More Stories
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం
సిపిజే కార్యకర్తలను తరిమి కొట్టిన గ్రామస్థులు