రాజస్థాన్‌లోని జైపూర్‌లో రాంపురా-కన్వర్‌పురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన సిజెపి కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పాఠశాల వద్దకు చేరుకున్న సీజేపీ సహ కన్వీనర్ అశుతోశ్ రంకా, ఇతర కార్యకర్తలను గ్రామస్థులు అడ్డుకోవడంతో వివాదం పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీజేపీ కార్యకర్తలపై దాడి చేసి, వారి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు అక్కడి గ్రామస్థులు. అనంతరం సీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమికొట్టారు.
జైపూర్‌లోని రాంపుర కన్వర్‌పుర గ్రామంలోకి ప్రవేశిస్తున్న సిజెపి బృందాన్ని ఒక గుంపు అడ్డుకుని, దూషిస్తూ, వారిపై దాడి చేస్తున్న దృశ్యాలు ఆందోళనకరమైన వీడియోలలో కనిపించాయి. ఆ గుంపు వారికివ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వారిని “అర్బన్ నక్సల్స్”, “దేశద్రోహులు” మరియు “పాకిస్థానీలు” అని సంబోధించింది. అయితే, తమ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తమను ఉగ్రవాదులు, నక్సలైట్లు అని దూషించారని సీజేపీ నాయకురాలు శివాంగి శర్మ ఆరోపించారు.
పిల్లల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న తమను బయటి వ్యక్తులుగా చూడటం సరికాదన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని సహ కన్వీనర్ అశుతోశ్ రంకా విమర్శించారు. తమకు మద్దతు తెలిపిన మహిళలపై కూడా దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. తమపై దాడికి పాల్పడినవారిపై 48 గంటల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇంతలో రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది? అని ప్రశ్నిస్తూ, సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ గూండాలు అశుతోశ్, ఇతర సీజేపీ వాలంటీర్ల ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను రాజస్థాన్ పోలీస్ ఎలా అనుమతిస్తుంది? అని ప్రశ్నించారు.
మరోవైపు, పాఠశాల అభివృద్ధి కోసం తాము ఎప్పటినుంచో పోరాడుతున్నామని గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈ సమస్యను ఏ రాజకీయ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై స్థానికుడైన జుగల్ కిషోర్ శర్మ స్పందిస్తూ . “మేము ఏమీ చేయలేదు. వారే 250 మంది వచ్చారు. మేం వారిని కొట్టలేదు. వారితో ప్రశాంతంగానే మాట్లాడాం. కానీ వారే స్వయంగా తమ కారును ధ్వంసం చేసుకున్నారు” అని ఆరోపించారు.
“పాఠశాల మరమ్మతుల కోసమే వచ్చామని వారు చెబుతున్నారు. కానీ ఆ పని మా ఎమ్మెల్యే ద్వారానే జరుగుతుంది. దాని కోసం రూ. 12 లక్షలు కేటాయించారు. బీజేపీ లేదా కాంగ్రెస్ తప్ప వేరే ఏ పార్టీని ఇక్కడికి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే మేం వారిని అడ్డుకున్నాం” అని గ్రామస్థుడు పేర్కొన్నారు.

More Stories
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
నలుగురు బాలికలపై అత్యాచారం.. పాస్టర్కు నాలుగు మరణశిక్షలు