రాముడు, శివుడిని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిందువులను విభజించేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ హిందువులను విభజించేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉందని, ఇప్పుడు ఏకంగా హిందూ దేవుళ్లనే విడదీసేందుకు తెగించిందని పేర్కొన్నారు.
ఇది అత్యంత నీచ రాజకీయాలకు ఉదాహరణ అని విమర్శించారు. ఎవరైతే రాముణ్ని వ్యతిరేకిస్తూ శివుణ్ని పూజిస్తారో వాళ్లు రావణుడి వంటి వారేనని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ఇది వాస్తవమని, రామ్చరిత్ మాన్సలో ఈమేరకు రాసి ఉందని, అది రాక్షసుల తీరేనని మండిపడ్డారు. కాంగ్రెస్ హిందూ సమాజాన్ని ఉత్తరాది, దక్షిణాదివారిగా విభజించాలని చూస్తోందని త్రివేది ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ కాంగ్రెస్ కు ముస్లింలు బలమని, ముస్లింలకు కాంగ్రెస్ బలమని చెప్పారని గుర్తు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాక రాహుల్‌గాంధీ దేవుడి పేరు మీద ప్రమాణస్వీకారం చేయలేదని పేర్కొంటూ ఆయన నాస్తికుడు.. ఆయన పార్టీ నాస్తిక పార్టీ అని విమర్శించారు.
హిందువుల విషయంలోనే కాంగ్రెస్ పితృస్వామ్యం సమస్య అంటూ గోల చేస్తుందని, అదే కేరళం గ్రాండ్ ముఫ్తీ మహిళలు ఇంటికే పరిమితం కావాలని, వారిని నెక్లెస్ లా భద్రంగా ఉంచాలని అన్నప్పుడు మాత్రం నోరెత్తదని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ వాళ్లు తమ దేశం కోసం భారతీయుల్ని విభజించారని, అదే కాంగ్రెస్ అధికారం కోసం దేశంలో ప్రతీ ఒక్కరినీ విభజించిందని విమర్శించారు.
మీరు (కాంగ్రెస్, సీఎం రేవంత్) శివుడి పరమ భక్తులైతే కాశీవిశ్వనాథ్ ఆలయంలో ఔరంగజేబ్ పేరు మీదున్న మసీదును ఏం చేద్దామనుకుంటున్నారు.. చెప్పండి? అని ప్రశ్నించారు. ఆ విషయంలో కోర్టు నిర్ణయం తీసుకుంటుందని, అయితే తాను మాత్రం శివుడి ఏ జ్యోతిర్లింగంపైనా విదేశీ ఆక్రమణదారుల గుర్తులు ఉండకూడదని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో రేవంత్, నాస్తిక రాహుల్, కాంగ్రెస్ స్పందించాలని కోరారు.

More Stories
కీలక అంశాలపై ట్రంప్- మోదీ ఫోన్ సంభాషణ
2029 చివరకు మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా పంజాబ్
ఫారం 6 నుంచి అదనపు డిక్లరేషన్ తొలగింపు