మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మాజి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం జరుపుతున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంలో సవాలు చేశారు. ఈ ఎస్ ఎల్ పిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం విచారణ జరిపింది. అసలు పిటిషన్ దాఖలు చేయడానికి మీరెవరని, విచారణ సందర్భంగా ఉండవల్లిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తే, మీ వ్యక్తిగత వివాదంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయని జస్టిస్ ఎంఎం సుందరేశ్ వ్యాఖ్యానించారు. మార్గదర్శి తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రూ.2,500 కోట్లు వెనక్కి ఇచ్చారని, క్లెయిమ్ చేయని రూ.5.23 కోట్లు ఎస్క్రో అకౌంట్లో జమ చేశారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు, తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని తెలిపారు. సుప్రీం ఆదేశం మేరకు పబ్లిక్ నోటీసు ఇచ్చి తదుపరి ప్రక్రియ నిర్వహించారని మార్గదర్శి న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఉండవల్లి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉంటూ ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తోందంటూ, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది.
వైఎస్ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై నమోదు చేసిన క్రిమినల్ కేసును 2018లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు, మళ్లీ తెలంగాణ హైకోర్టుకు పంపించింది. డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించి, మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం అవసరమా లేక వృథా కసరత్తా అనే విషయం నిర్ధారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ 2024 సెప్టెంబరు 26న డిపాజిట్లు క్లెయిమ్ చేయని వారుంటే అభ్యంతరాలు సమర్పించాలని పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇచ్చారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అప్పటికే డిపాజిటర్లందరికీ డబ్బులు తిరిగి చెల్లించినందున, ఒక్క డిపాజిటర్ కూడా అభ్యంతరం సమర్పించేందుకు ముందుకు రాలేదు.
హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్‌లో మరణించినందున 2008లో నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ గతేడాది జనవరిలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఇంకా కేసు కొనసాగించాల్సిన అవసరం లేదంటూ గతేడాది ఆగస్టు 4న కేసు కొట్టివేసింది.

More Stories
ఢిల్లీ ఎస్టీపీ టెండర్ల కుంభకోణంలో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్
ఝార్ఖండ్ పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి అభయ్ భార్య, సోదరుడి అరెస్ట్
అయోధ్య విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్!