అరుణాచల్ భూభాగం చైనా ఆక్రమణ ప్రచారంలో నిజం లేదు!

అరుణాచల్ భూభాగం చైనా ఆక్రమణ ప్రచారంలో నిజం లేదు!
భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమే అని తేల్చి చెప్పారు.  
 
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌సిరి జిల్లాలో చైనా దళాలు చొరబడ్డాయన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు; చైనా దళాలు ‘వాస్తవ నియంత్రణ రేఖ’ (ఎల్ఏసి)ను దాటి తక్సింగ్ సర్కిల్ పరిధిలోని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 కిలోమీటర్ల ప్రాంతంలోకి చైనా ప్రవేశించిందనేది అబద్ధమని, దీనికి సంబంధించి షేర్ అవుతున్న వీడియోలు తప్పు అని మంత్రి చెప్పారు. 
 
ఇదంతా తమ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న ప్రచారమని పేర్కొన్నారు.‘‘అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు సమస్య ఉంది. ఈ అంశంపై స్తానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. వారి ఆందోళనకు అర్థం ఉంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించకపోవడం వల్లే ఇదంతా. హద్దులు గుర్తించకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల విషయంలో ఇలాంటి ప్రచారాలు సహజం” అని తెలిపారు. 

అంతమాత్రాన మన గ్రామాల్ని చైనా ఆక్రమించుకున్నట్లు కాదని పేర్కొంటూ  మన భూభాగం మీద ఎప్పటినుంచో చైనా దృష్టి ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. భారత సరిహద్దు మరింత విస్తరించిందని, ఈ ప్రాంతంలో చైనా వైపు ఉన్న టిబెటన్లు, ఇతర స్థానికులు తమ భూభాగం మరింత దూరం విస్తరించి ఉందని భావించడం వల్ల గందరగోళం ఏర్పడుతోందని కిరణ్ రిజిజు వివరించారు. 

దీన్ని సాకుగా చూపి, అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 కిలోమీటర్లు ఆక్రమించుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. “అవి బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఫొటోలు. మన ఆర్మీ, భద్రతా బలగాల్ని తక్కువ చేసేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీంతో దేశంలో గందరగోళం ఏర్పడుతోంది’’ అని కిరణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు. 

“కొన్ని ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి, గ్రామస్తుల ఆందోళనలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, బంగ్లాదేశ్‌కు సంబంధించిన వాటితో సహా తప్పుడు వీడియోలు, ఆరోపణలను ప్రచారం చేయడం సరికాదు. ఇది సాయుధ దళాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది మరియు దేశంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది” అని ఆయన హెచ్చరించారు. 

రిజిజు ప్రకారం, అసలు సమస్య ఏమిటంటే చైనా సరిహద్దు ప్రాంతాల్లో చాలా కాలం క్రితమే రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించింది. “ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను నిర్మించకూడదన్నదే భారతదేశ విధానమని పార్లమెంటులో చెప్పారు. అదే సమయంలో, చైనా మాత్రం రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కొనసాగించింది” అని ఆయన పేర్కొన్నారు. 

“మనం రహదారిని నిర్మించడంలో విఫలమైనప్పుడు చైనా విజయం సాధించింది. తద్వారా చైనా సైన్యం ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించి, సరిహద్దు మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది” అని తెలిపారు. అయితే, 2014 తర్వాత పరిస్థితి మారిందని, ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసిందని రిజిజు తెలిపారు. 1947 నుండి ఎటువంటి అభివృద్ధి జరగని మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వం రహదారులను నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. 

సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు వెల్లడించారు. చైనా సరిహద్దులో భారతీయ సైన్యంపాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా పహారా కాస్తున్నట్లు తెలిపారు.