టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ

టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై పశ్చిమ బెంగాల్‌లోని కోర్టు విద్వేష ప్రసంగంపై దాఖలైన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ జిల్లా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తులసి మాలలపై మత విశ్వాసాలు దెబ్బతీసేలా మహువా మొయిత్రా వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై కేసు నమోదైంది.

అదే సమయంలో భారతీయ సైన్యంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ కోసం ఆమె కోర్టులో స్వయంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం పలుమార్లు ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె కోర్టుకు రాలేదు. బుధవారం కూడా విచారణకు రావాల్సి ఉంది. 

దీనిపై మంగళవారమే ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఈ రోజు కూడా ఆమె విచారణకు హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణానగర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. మహువా మొయత్రా కోర్టుకు హాజరు కారని ఆమె తరఫు న్యాయవాది కూడా కోర్టుకు త తెలిపారు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి ఆమె వైఖరి కోర్టులపై ఎలాంటి గౌరవం లేదనే విషయాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో తప్పనిసరిగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మహువా మొయిత్రా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఆగష్టు 15న విచారణకు హాజరుకావాలంటూ గతంలో స్తానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

 కానీ, ఈ పిటిషన్‌ విచారణకు కోర్టు అంగీకరించలేదు. దీంతో ఆమె తరఫు లాయర్లు తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. కాగా, కల్పిత ఆరోపణలపై ఆధారపడిందని మోయిత్రా పేర్కొన్న విద్వేషపూరిత ప్రసంగం కేసులో, ఆమెపై బలవంతపు చర్యల నుండి అక్టోబర్ 5 వరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ కలకత్తా హైకోర్టు జూలై 21న తీర్పు ఇచ్చింది.

నాదియా జిల్లాలోని హోగోల్బేరియా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో పోలీసుల బలవంతపు చర్యలను నివారించాలని, తనపై ఉన్న విచారణను రద్దు చేయాలని కోరుతూ కృష్ణనగర్ ఎంపీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ అధికారి ఎదుట ఆగస్టు 14న హాజరు కావాలని హైకోర్టు న్యాయమూర్తి సౌగత భట్టాచార్య మోయిత్రాను ఆదేశించారు.