తెలంగాణాలో సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు

తెలంగాణాలో సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలో సినిమాల టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూనే, ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు రాబడిలో నిర్దిష్ట మొత్తాన్ని చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
తాజా మార్గదర్శకాల ప్రకారం, టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సరిగ్గా 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిజిఎఫ్డిసి) నిర్వహించే ప్రత్యేక సంక్షేమ విరాళంగా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను చిత్ర నిర్మాణ సంస్థలకే అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అద‌న‌పు ఆదాయంపై వర్తించే ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి నేరుగా నిర్మాతలే వసూలు చేయాలి.  
 

సింగిల్ థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ల్లో నిర్దిష్టమైన టికెట్ ధరలు ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో టికెట్ ధరను కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70 ఖరారు చేసింది. అలాగే నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా నిర్ణయిచింది. ఏసీ థియేట్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150 ఖరారు చేయగా, ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 గా నిర్ణయిచింది. 

ఇక స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 ఖరారు, స్పెషల్ థియేటర్లలో ప్రీమియం రిక్లైనర్‌లో కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 ఖరారు చేసింది. దీంతోపాటు మల్టీఫ్లెక్స్‌లో రెగ్యులర్ కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250 టికెట్ ధర ఉండగా, మల్టీఫ్లెక్స్‌లో రెక్లైనర్‌లో కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 టికెట్ ధర ఖరారు చేసింది.

ఇక ప్రతి థియేటర్‌లో ఉదయం 8 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 మధ్య చిన్న సినిమాకు అవకాశం ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. పండుగ సీజన్లోనూ చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో కొత్తగా ‘స్పెషల్ థియేటర్లు’ అనే కేటగిరీని చేర్చారు. 

7.1 సౌండ్, 2కె, 4కె స్క్రీన్ రిజల్యూషన్ లేదా స్క్రీన్ సైజ్ 75 అడుగుల కంటే ఎక్కువగా ఉన్న థియేటర్లను ‘స్పెషల్ థియేటర్లు’గా పరిగణిస్తారు. ఇందులో భారీ బడ్జెట్ సినిమా రిలీజైన సమయంలోనే చిన్న చిత్రాలు కూడా విడుదలైతే వాటికి ఉదయం 11 నుంచి రాత్రి 9 మధ్యలో కచ్చితంగా ఒక షోను కేటాయించాలని నిబంధన పెట్టింది. చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే రూ.100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్తో రూపొందించే చిత్రాలను ‘హై బడ్జెట్’ సినిమాలుగా గుర్తించనుంది. ఈ సినిమాలకు రిలీజైన తొలి 10 రోజులు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే అలా టికెట్ రేటును పెంచుకుంటే మాత్రం వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్కు విరాళంగా ఇవ్వాల్సిందేనని అదేశాలు ఇచ్చింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆ నిధిని ఉపయోగించనున్నట్లు చెప్పింది.