2027 జనాభా గణన ప్రారంభానికి ముందే మణిపూర్లో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్’ (ఎన్ ఆర్ సి)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ‘క్యాంపెయిన్ ఫర్ జస్ట్ అండ్ ఫెయిర్ డీలిమిటేషన్’ (జె ఎఫ్ డి) పిలుపునిచ్చిన 48 గంటల సార్వత్రిక సమ్మె మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా లోయ ప్రాంత జిల్లాల్లో మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు నిర్వహించారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి. ఈ సమ్మె బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. చాలా ప్రాంతాల్లో ఆందోళన శాంతియుతంగానే సాగినప్పటికీ, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఘటనలో, భద్రతా దళాల కాన్వాయ్ మద్దతుదారుల గుంపుపై నకిలీ బాంబును ప్రయోగించడంతో ఒక మహిళ గాయపడ్డారు. అలాగే, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని పోరోంపట్లో పోలీసు చర్య సందర్భంగా కనీసం నలుగురు మహిళా నిరసనకారులు గాయపడినట్లు సమాచారం.
ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో నిరసన తెలపాలని, ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిరసనకారులకు విజ్ఞప్తి చేసింది. ఎన్ ఆర్ సి, జనాభా గణన అంశాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రభుత్వ ప్రతినిధి, ఎమ్మెల్యే సపం రంజన్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ ఆర్ సి, అమలును కోరుతూ మణిపూర్ శాసనసభ 2022 ఆగస్టు 5న తీర్మానం చేసిందని, ఆ తర్వాత 2024 మార్చి 1న అసెంబ్లీ ఆ తీర్మానాన్ని పునరుద్ఘాటించిందని ఆయన గుర్తుచేశారు.
ఎన్ ఆర్ సి, అంశం చాలా కాలంగా ఉన్న సమస్య అని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిరంతరం కృషి చేస్తోందని సింగ్ చెప్పారు. మార్గదర్శకత్వం కోసం, అలాగే మణిపూర్లో ఎన్ ఆర్ సి అప్డేషన్ ప్రక్రియను చేపట్టాలని కేంద్రాన్ని కోరేందుకు ఎమ్మెల్యేల బృందం ఒకటి ఢిల్లీకి వెళ్తుందని ఆయన తెలిపారు.
సమిష్టి విధానం అవసరమని నొక్కిచెప్పిన సింగ్, రాజకీయ అనుబంధాలు, సామాజిక వర్గాలు లేదా ఇతర విభేదాలతో సంబంధం లేకుండా ఈ సమస్యను అందరూ కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు, ఎందుకంటే ఇది రాష్ట్రం మరియు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. రాష్ట్రంలో ఎన్ ఆర్ సి, ప్రక్రియను చేపట్టే ముందు అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.

More Stories
కోల్కతా హోటల్ మంటల్లో 9 మంది బంగ్లాదేశీయులు మృతి
సీజేపీ పార్లమెంట్ మార్చ్ చట్ట వ్యతిరేకం
మహారాష్ట్రలో మత స్వాతంత్రం చట్టం 28 నుండి అమలు