* అమిత్ షాకు ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ లేఖ
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఆగస్టు 13న శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడి) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన దాడి, డిసెంబర్ 2024లో గోల్డెన్ టెంపుల్ వద్ద ఆయనను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కోరుతూ, ఎస్ఏడి ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
సుఖ్బీర్ బాదల్ భార్య అయిన హర్సిమ్రత్ కౌర్, తన లేఖలో మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆగస్టు 13న జరిగిన ఘటనను “అత్యంత నీచమైన, ఘోరమైన హత్యాయత్నం”గా అభివర్ణించారు. ఈ దాడిలో ఉపయోగించినట్లు ఆరోపించబడిన ఆయుధం ఫోటోను మీడియాకు చూపిస్తూ, ఆమె ఇలా అన్నారు: “దాడి చేసిన వ్యక్తి ఒకటిన్నర అడుగుల పొడవున్న పదునైన ఆయుధంతో ఆయన ఛాతీని లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ సుఖ్బీర్ సింగ్ బాదల్ తనను తాను రక్షించుకోవడానికి చేయి పైకి ఎత్తడంతో, ఆ బ్లేడ్ ఆయన ముంజేతిని చీల్చుకుంటూ దూసుకెళ్లింది.”
సుఖ్బీర్కు కుట్లు వేసిన చేయి ఒక వైపు ఫోటోను కూడా ఆమె చూపించారు. ఇది రెండవ హత్యాయత్నమని నొక్కిచెబుతూ, గతంలో పంజాబ్‌లో సుఖ్‌బీర్‌పై దాడి చేసిన మరో వ్యక్తి ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్నాడని పేర్కొంటూ ఆప్ పాలనలో ఉన్న తన సొంత రాష్ట్రంలోని పోలీసులు ఈ కేసును “అణచివేశారని” ఆమె ఆరోపించారు.
ఈ ఘటన తీవ్రత, జరిగిన తీరు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, దీని దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ఆగస్టు 13 నాటి దాడితో పాటు, అంతకుముందు డిసెంబర్ 4, 2024న అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద సుఖ్బీర్ బాదల్ ప్రాణాలను తీయడానికి జరిగిన ప్రయత్నంపై కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆమె కేంద్రాన్ని కోరారు.
ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉందా? వీటి వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అనే అంశాలపై కూడా విచారణ జరపాలని ఆమె కోరారు. ఈ రెండు హత్యాయత్నాల మధ్య “అనేక ఆందోళనకరమైన పోలికలు” ఉన్నాయని, ఇవి పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయా లేదా వీటి వెనుక ఏదైనా “పెద్ద కుట్ర” ఉందా? అనే తీవ్రమైన ప్రశ్నలను ఈ ఘటనలు లేవనెత్తాయని మాజీ కేంద్ర మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
“ఆగస్టు 13, 2026న నా భర్త, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సర్దార్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన నీచమైన, ఘోరమైన హత్యాయత్నం నేపథ్యంలో నేను ఈ లేఖ రాస్తున్నాను. వ్యక్తిగత వేదనతో పాటు మన సమాజం, పంజాబ్ రాష్ట్రం మరియు దేశం పట్ల తీవ్ర ఆందోళనతో దీనిని రాస్తున్నాను; ముఖ్యంగా రాజకీయ పోరాటాల సాధనంగా హింసను సాధారణీకరించడం, పైగా అధికారంలో ఉన్న వ్యక్తులే దానిని సమర్థించడం పట్ల నాకు ఆందోళనగా ఉంది” అని ఆమె తెలిపారు.
ఒక స్వతంత్ర కేంద్ర దర్యాప్తు ద్వారా మాత్రమే సంఘటనల పూర్తి క్రమాన్ని నిర్ధారించడం, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు సంస్థలను గుర్తించడం, రెండు దాడుల మధ్య సంబంధం ఉందో లేదో తేల్చడం, తీవ్రవాద లేదా విదేశీ సంబంధాలు ఏమైనా ఉన్నాయో పరిశీలించడం, అలాగే ప్రభుత్వ అధికారుల వైఫల్యం, కుమ్మక్కు లేదా ఉద్దేశపూర్వక విధి నిర్వహణ లోపం ఏమైనా ఉందో లేదో నిర్ధారించడం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ తాజా దాడి తన భర్త భద్రత, మతపరమైన ప్రదేశాల పవిత్రత, పంజాబ్‌లో రాజకీయ హింస సాధారణీకరణకు గురవుతుండటం వంటి అంశాలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించిందని హర్సిమ్రత్ తెలిపారు. ఈ దాడిలో సుఖ్బీర్ బాదల్ కుడి చేతికి గాయమైంది. అలాగే దాడి చేసిన వ్యక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బంది ఒకరు కూడా గాయపడ్డారు. భద్రతా అధికారి సకాలంలో స్పందించకపోతే పరిణామాలు ప్రాణాంతకంగా మారేవి అని హర్సిమ్రత్ పేర్కొన్నారు.

More Stories
జిన్‌పింగ్ పర్యటన వ్యాపార సంబంధాలను మెరుగు పరుస్తుందా?
‘మిస్టర్ సింగ్’ పోస్టర్ తో ట్రంప్ బృందం జాత్యాహంకార వ్యాఖ్యలు
పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలు ప్రధానం