పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నం

పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జరిగిన గందరగోళం, నినాదాలు, వాయిదాలపై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను పదేపదే అడ్డుకోవడం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విపక్షాల నిరసనలు కేవలం సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికే పరిమితం కాకుండా, పార్లమెంటరీ వ్వవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే స్థాయికి చేరాయని వ్యాఖ్యనించారు.

“ఇలాంటి పరిణామాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. వ్యవస్థను అసమర్థంగా, విశ్వసనీయత లేనిదిగా చూపించి, ప్రజల్లో తమ ఎన్నికైన ప్రతినిధులపై అనుమానాలు కలిగించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంగా పరిణామాలను చూడాల్సి వస్తోంది. పార్లమెంట్‌ సజావుగా నడవడానికి అధికార, విపక్ష పక్షాలు రెండూ సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. 

“సభను నడపడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు విపక్షాలు కూడా చర్చలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాజ్యాంగాన్ని పదేపదే ప్రస్తావిస్తూ దాని ప్రతులను చేతబట్టి తిరుగుతున్నామని చెప్పుకుంటూనే సభలో మన ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకోవాలి. ఒక వర్గం సభను స్తంభింపజేయాలని నిర్ణయించుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి” అని తెలిపారు. 

“పరీక్షల్లో పేపర్‌ లీకులు, అక్రమాలకు సంబంధించిన సమస్య కొత్తది కాదు. దశాబ్దాలుగా ఈ సమస్య కొనసాగుతోంది. 25 నుంచి 30 ఏళ్లుగా, అంతకంటే ముందునుంచే పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకుల సమస్యలు ఉన్నాయి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రయత్నించినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలో ఓ ప్రభుత్వం కూలిపోయింది” అని గుర్తు చేశారు. 

 
“విద్యార్థుల ఆవేదనను అందరూ అర్థం చేస్తున్నారు. అందుకే వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సున్నితంగా స్పందించి చర్యలు తీసుకుంది. అయితే ఆందోళనల్లో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, నినాదాలు తనను తీవ్రంగా బాధించాయి. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా దూషణలకు దిగడం దేశానికి మంచిది కాదు. విద్యార్థుల కేవలం విద్యా వ్యవస్థకే పరిమితం కాకుండా, రాష్ట్రాల్లో పాలనా వ్యవస్థకు సంబంధించిన సంస్కరణల అవసరాన్ని కూడా పరిశీలించాలి” అని హరివంశ్ సూచించారు.
 
డీలిమిటేషన్ రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియ అని చెబుతూ దానిని నిరవధికంగా వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెబుతున్నవారని, అందులో నిర్దేశించిన ప్రక్రియను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు ఉంటే అన్ని పార్టీలు కలిసి కొత్త రాజ్యాంగ నిబంధన తీసుకురావడంపై చర్చించాలని, కానీ ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియను పదేపదే వాయిదా వేయడం సరికాదని హితవు చెప్పారు.