‘దిమాగీ నక్సల్స్’  వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి కాదు

‘దిమాగీ నక్సల్స్’  వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి కాదు

ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన  ‘దిమాగీ నక్సల్స్’  వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి కాదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు మద్దతిచ్చేవారిని, రాజ్యాంగాన్ని తిరస్కరించేవారిని ఉద్దేశించి మోదీ, అలాంటి వ్యాఖ్యలు చేశారని రిజిజు చెప్పారు.  వేర్పాటువాదుల పక్షాన నిలిచేవారు, ఆర్టికల్‌ 370కి మద్దతిచ్చేవారు, ఈశాన్య భారతంలో చికెన్‌ నెక్‌ను వేరు చేయాలని పిలుపు ఇచ్చేవారినే అలా అన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  

 “ప్రధాని నరేంద్ర మోదీజీ ప్రతిపక్ష నాయకులను దిమాగీ నక్సల్స్ అని అనలేదు. ఈ క్రింది వారు మాత్రమే దిమాగీ నక్సల్స్: 1. మావోయిస్టులకు మద్దతు ఇచ్చి, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారు. 2. వేర్పాటువాదులతో నిలబడి, ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చే వారు. 4. ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుండి వేరు చేయడానికి కోడి మెడ కోయాలని కోరుకునే వారు,” అని రిజిజు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించినప్పటికీ  ‘దిమాగీ నక్సల్స్’  ముప్పు ఇంకా పొంచి ఉందని  ప్రధాని మోదీ చెప్పడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. మేధో నక్సల్స్‌ అనే పదం ఎక్కడాలేదన్నారు. రెండు, మూడేళ్ల క్రితం రాజకీయ ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అనే పదంతో ప్రధాని విమర్శించేవారిని పేర్కొంటూ ఈ పదం కూడా అలాంటిదేనని చెప్పుకొచ్చారు. 

కుల గణన కోసం డిమాండ్ చేసే వారి ఆలోచనలు అర్బన్‌ నక్సల్స్ మాదిరిగా ఉన్నాయని, గతంలో ప్రధాని విమర్శించినట్లు జైరాం రమేష్ గుర్తు చేశారు. ఏడాది తర్వాత కులగణనకు ఆయన ఆదేశించారని చెప్పారు. ప్రత్యర్థులను తొలుత విమర్శించడం, తర్వాత వారి డిమాండ్లను అంగీకరించడం ప్రధానికి అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే మేధో నక్సల్స్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు వివరణ ఇచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘దిమాగీ నక్సల్స్’ అని అభివర్ణించిన వారిపై చేసిన హెచ్చరికపై, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. “నేను ఒక దిమాగీ నక్సల్ అయినందుకు గర్వపడుతున్నాను!” అని ఆయన ప్రకటించారు.  మోదీ మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఘాటుగా స్పందించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన చదువుకొన్న యువతపై ప్రధాని అటువంటి ముద్ర వేయడం తగదని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ మండిపడ్డారు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ఇలా అంటారా?’ అని ప్రశ్నించారు.