శంషాబాద్ విమానాశ్రయానికి తగ్గిన విదేశీ ప్రయాణికుల రద్దీ

శంషాబాద్ విమానాశ్రయానికి తగ్గిన విదేశీ ప్రయాణికుల రద్దీ

మధ్యప్రాచ్యంలో తొలగని యుద్ధ ప్రభావం కారణంగా హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి.  అమెరికా సహా పలు దేశాల నుంచి మనదేశానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఓవైపు ఇంధన సర్ఛార్జితో పాటు విమాన టికెట్ల ధరల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అమెరికాలో ఉన్నత చదువులపై సందిగ్ధత నెలకొనడం కూడా ప్రయాణికుల రాకపోకలపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది

గతేడాది జూన్‌ నెలతో పోల్చినట్లయితే ఈ ఏడాది జూన్‌లో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య బాగా పడిపోయింది. గతేడాది జూన్‌ నెలలో 4.42లక్షల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించగా, ఈ ఏడాది జూన్‌ నెలలో 4.30లక్షల మంది మాత్రమే ప్రయాణించడం గమనార్హం.  మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో వృద్ధిరేటు మైనస్‌లలోకి పడిపోయింది. 

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గతేడాది త్రైమాసికంలో 11.37లక్షల మంది విదేశీ ప్రయాణికులు ప్రయాణించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ ఈ మూడు నెలలు కలిపి 11.20 లక్షల మంది ప్రయాణించారని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) తన నివేదికలో తెలిపింది. మెట్రో నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వృద్ధిరేటు పరిశీలించినట్లయితే అన్ని విమానాశ్రయాల్లో 8 నుంచి 12 శాతం వృద్ధిరేటు ఉండేది. 

గత సంవత్సరం అక్టోబరు నుంచి వృద్ధి రేటు తిరోగమనం దిశగా వెళుతోంది. అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలున్నప్పటికీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏటా వృద్ధిరేటు పెరుగుతుండగా గతేడాది ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో విదేశీ ప్రయాణికుల రాకపోకలతో పోల్చినట్లయితే ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసికంలో మైనస్‌ వృద్ధిరేటు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలల్లో కలిపి 78 లక్షల మంది శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగించారు.  దేశీయ ప్రయాణికులకు మరిన్ని సేవలందించడం ద్వారా, రాకపోకల సంఖ్య మరింత పెంచాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.