మరో 7 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రైల్వేశాఖ ఆమోదం

మరో 7 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రైల్వేశాఖ ఆమోదం

* చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్‌కు ఒక రైలు

మరో 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దేశంలోని అనేక దూర ప్రాంతాలను కలిపేలా, తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం అందేలా ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే బోర్డ్ వెల్లడించింది. చౌక ధరల్లోనే, ప్రీమియం రైల్వే ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ తరహా రైళ్లను నడుపుతోంది. అది కూడా దూర మార్గాలకు. కొత్తగా ప్రతిపాదించిన రైళ్లు దేశంలోని నాలుగువైపులా పట్టణాలను కలుపుతాయి.

ప్రతిపాదించిన ఏడు రైళ్లలో తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఒక రైలును కేటాయించారు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి యూపీలోని గోరఖ్‌పూర్ వెళ్తుంది. ఇది తెలంగాణలోని అనేక పట్టణాల నుంచి వెళ్తుంది. కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల నుంచి బల్హార్షా, నాగ్‌పూర్, భోపాల్ వంటి పట్టణాల నుంచి వెళ్తుంది. మిగతా రైళ్ల వివరాలివి. 

రెండోది ధన్బాడ్‌-కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది జార్ఖండ్, తమిళనాడు మధ్య ప్రయాణిస్తుంది. మార్గమధ్యలో అనేక పట్టణాల గుండా వెళ్తుంది. ఆ తర్వాత మూడోది యూపీలోని ప్రయాగ్‌రాజ్‌-ఎల్టీటీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌. ఇది ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రలను కలుపుతుంది. ఇది వీక్లీ సర్వీస్. 

ప్రయాగ్‌రాజ్, శాట్నా, జబల్‌పూర్, ఇటార్సి, భుసవాల్, కల్యాణ్ పట్టణాల మధ్య నడుస్తుంది. వడోదర, కోట, ఫతేపూర్ వంటి పట్టణాల నుంచి వెళ్తుంది. నాలుగో రైలు సుబేదార్‌గంజ్‌-లోకమాన్య తిలక్ టెర్మిన్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది కూడా వీక్లీ సర్వీస్. ఇది ముంబై, ప్రయాగ్‌రాజ్ పట్టణాల మధ్య నడుస్తుంది. ఐదవది గోరఖ్‌పూర్-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.

ఇది యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీ మధ్య నడిచే వీక్లీ సర్వీస్. బస్తి, గోండా, బుర్వాల్, బరేలి వంటి పట్టణాల నుంచి ప్రయాణిస్తుంది. ఆరవది గోరఖ్‌పూర్-బాంద్రా అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది కూడా వీక్లీ సర్వీస్. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ముంబై ప్రయాణిస్తుంది. 

మధ్యలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని పలు పట్టణాల గుండా వెళ్తుంది. భోపాల్, లక్నో, కాన్పూర్, గోండా వంటి పట్టణాల నుంచి వెళ్తుంది. చివరిది ప్రయాగ్‌రాజ్-ఉధ్నా అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రయాగ్‌రాజ్ నుంచి ఉద్నా వెళ్తుంది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి వెళ్తుంది.