మావోయిస్టు నుంచి యువతులు మోడలింగ్‌ వైపు

మావోయిస్టు నుంచి యువతులు మోడలింగ్‌ వైపు
మావోయిస్ట్‌  అనే పదం వినగానే అందరికీ గుర్తుకువచ్చేది ఒంటిపై మందమైన ఒకేలాంటి వస్త్రం, చేతిలో ఆయుధం, సమాజాన్ని వదిలి దండకారణ్యంలో నివాసం అని. ఈ జీవితాన్ని వదిలి జనంలోకి వచ్చిన వారి జీవితాలు ఒక్కొక్కరివి ఒక్కో విధంగా ఉంటాయి. కానీ దీనికి భిన్నంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన మాజీ మహిళా మావోయిస్టుల జీవితం అందంగా ఆవిష్కృతమైంది. 
 
ఇందుకు రాయ్‌పూర్‌లో జరిగిన చేనేత దినోత్సవం 2026 కార్యక్రమం వేదికయ్యింది. అక్కడ బస్తర్‌లోని మాజీ మహిళా మావోయిస్టులు సంప్రదాయ చేనేత వస్త్రాలను ధరించి మోడల్‌గా మారి ర్యాంప్‌పై వాక్‌ చేశారు. సాంప్రదాయ కొస సిల్క్‌ వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై నడుస్తుంటే పండిట్‌ దీన్‌దయాళ్‌ ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది.
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ముందుకు నడిచేందుకు ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచింది.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  విష్ణుదేవ్‌ సాయి వారితో మాట్లాడి వారి కొత్త జీవితం విజయం సాధించాలని కోరారు. మాజీ మహిళా మావోయిస్టులు చేయూతనిచ్చే సంస్థలతో కలిసి తమకు నచ్చిన వృత్తులవైపు అడుగుపెడుతున్నారు.  అలా వీరు సంఘర్షణల జీవితం నుంచి మోడలింగ్‌వైపు మళ్లారు. ఈ ఫ్యాషన్‌ షో వారి తిరుగుబాటు జీవితాన్ని వదిలి కొత్త జీవితం ఆరంభానికి ఆసరాగా నిలిచింది.
సమాజంతో కలిసిపోవడానికి కొత్త అవకాశం లభించింది. ఈ మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్‌ వాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మారిన వారి జీవనశైలిని చూసి చాలామంది స్పందించారు.  ఇదే నిజమైన మహిళా సాధికారత అని వీడియో చూసిన ఒక వ్యక్తి పేర్కొన్నారు. ఇదే నిజమైతే దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు అని మరొకరు అభిప్రాయం తెలిపారు.
వారు మాజీ మావోయిస్టుల్లా కనిపించడం లేదని, ఇలాంటి కథలకు ప్రచారం ఎందుక లభించదు అని ఇంకొకరు తెలిపారు. వారి ఈ ప్రయాణం నిజంగా అద్భుతం అని మరొకరు వ్యాఖ్యానించారు.