పొరుగు దేశం నుండి భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యకైనా మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్ను గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదంపై దౌత్యపరమైన ఖండన నుండి నిర్ణయాత్మక సైనిక చర్య వైపు భారతదేశం మారుతోందనడానికి ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
“ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అవి దేశం వైఖరిలో వచ్చిన నిర్ణయాత్మక మార్పుకు ప్రతీకలు. దౌత్యపరమైన ఖండన నుండి ఉగ్రవాదాన్ని దాని మూలాల నుండే నిర్మూలించే లక్ష్యంతో చురుకైన చర్యల వైపు దేశం పయనిస్తోంది,” అని ఇక్కడ జరిగిన రక్షణ సదస్సులో ప్రసంగిస్తూ సింగ్ తెలిపారు.
సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ, శాంతి పట్ల దేశ నిబద్ధతను భద్రతాపరమైన ముప్పులకు ప్రతిస్పందించలేని అసమర్థతగా లేదా అయిష్టంగా భావించకూడదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. “భారతదేశం శాంతికి కట్టుబడి ఉంది. కానీ దానిని బలహీనతగా భావించకూడదు. సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము,” అని ఆయన నొక్కి చెప్పారు.
భారతదేశ సాంస్కృతిక విలువలు చర్చలు, సహజీవనం, వివాదాల శాంతియుత పరిష్కారానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, శాంతిని కాపాడటానికి బలం, సంసిద్ధత, దురాక్రమణను ఎదుర్కొనే సామర్థ్యం అవసరమని సింగ్ చెప్పారు. “శాంతి పట్ల మా నిబద్ధత దృఢంగా ఉంది. అయినప్పటికీ మేము ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. శాంతిని ప్రోత్సహిస్తూనే, భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, తన సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోగల పూర్తి సామర్థ్యం కలిగిన భారతదేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం,” అని ఆయన తెలిపారు.
మారుతున్న భద్రతా వాతావరణాన్ని సూటిగా ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం స్వరూపం మారుతోందని, ముప్పులు ఇకపై వ్యవస్థీకృత నెట్వర్క్లకే పరిమితం కాకుండా, ఒంటరి దాడులు చేసేవారు, ఆయన “వైట్-కాలర్ టెర్రరిజం”గా అభివర్ణించిన వారు కూడా ఇందులో ఎక్కువగా భాగమవుతున్నారని సింగ్ చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, దాడులను నివారించడానికి భద్రతా సంస్థలు, పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆవిర్భవిస్తున్న భద్రతా దృశ్యాన్ని వివరిస్తూ, ఆయన తప్పుడు సమాచారం, అస్థిరత, అంతరాయం, మోసం, విధ్వంసం అనే “5డి భద్రతా ముప్పు”గా పేర్కొన్నారు. హైబ్రిడ్, హై-టెక్ , హైపర్ వార్ఫేర్ వంటివి ముప్పులను గుర్తించడం, ఎదుర్కోవడం అనే పనిని మరింత సంక్లిష్టంగా మార్చాయని ఆయన హెచ్చరించారు. 2014 నుండి, చాలా మంది ఉగ్రవాదుల మనుగడ కాలం ఏడాది కన్నా తక్కువకు తగ్గిపోయిందని, భారతదేశానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన ఏడాదిలోపే భద్రతా దళాలు వారిని హతమార్చుతున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
రక్షణ సన్నద్ధతపై సింగ్ మాట్లాడుతూ, సైనిక బలాన్ని అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు, సరసమైన, అనుకూలమైన ఆయుధ వ్యవస్థలతో కలిపి “స్మార్ట్ పవర్” వైపు మారాలని పిలుపునిచ్చారు. “మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఆధునిక రక్షణ వ్యూహాలు, కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించే ఆయుధాలు, లోయిటరింగ్ మ్యూనిషన్స్ను తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాలతో, మానవ మేధస్సును కృత్రిమ మేధస్సుతో, అధునాతన వ్యవస్థలను తక్కువ ఖర్చుతో కూడిన, చురుకైన, అనుకూలమైన సాంకేతికతలతో అనుసంధానించాలి,” అని ఆయన తెలిపేరు.
ప్రభుత్వ రక్షణ సంస్కరణలు భారతదేశ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేశాయని, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాయని సింగ్ ప్రశంసించారు. తక్షణ అవసరాలు తీర్చడం కన్నా ఆత్మనిర్భర్, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రక్షణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించామని ఆయన చెప్పారు.

More Stories
నేహా బోరా ‘బంగ్లాదేశ్ మార్గం చూపింది’ వ్యాఖ్యలపై దుమారం
లక్షల కోట్ల రూ. భూకుంభకోణాలపై జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ
అరాచకత్వానికి ప్రతీకగా రాహుల్ గాంధీ