ధరణి, భూభారతి ముసుగులో జరిగిన ప్రతి ఎకరం అక్రమ బదిలీపై తక్షణమే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, లేదా సీబీఐ విచారణకు అప్పగించాలని బీజేపీ శాసనసభా పక్ష (బీజేఎల్పీ) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టును వెంటనే బహిర్గతం చేసి, అన్యాక్రాంతమైన 23 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకునే వరకు భారతీయ జనతా పార్టీ అటు అసెంబ్లీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ రాజీలేని న్యాయ, ప్రజాపోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా ఆధారాలతో సహా మీడియా ముందు సమగ్ర వివరాలను బహిర్గతం చేశారు. శాసనసభలో మూడు రోజుల పాటు బీజేఎల్పీ పక్షాన సభను స్తంభింపజేసి పోరాడితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం షార్ట్ డిస్కషన్‌కు దిగిరాలేదని ఆయన గుర్తు చేశారు. సభలో మంత్రులు, విప్‌లు తమ మైకులు కట్ చేసి మాట్లాడకుండా అడ్డుకున్నప్పటికీ, వాస్తవాలను సభ ముందుకు తీసుకొచ్చామని చెప్పారు.
ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పట్టుబట్టింది బీజేపీయేనని, తీరా ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యాక ఆ నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయకుండా, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. సిట్ పేరుతో ‘సెట్టింగ్’ రాజకీయం చేస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధరణిలో లక్షల కోట్ల దోపిడీ జరిగిందని, తాము రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకుని సంక్షేమ పథకాలకు నిధులు సమకూరుస్తామని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
గత పాలకుల అక్రమాలపై ఒక్క ఎకరం భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన అంశాలను కూడా ప్రభుత్వం తొక్కిపెడుతూ రెండు పార్టీలు కుమ్మక్కై చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా సుమారు 23 లక్షల ఎకరాల భూమి 13,000 అనుమానాస్పద ఖాతాలకు అక్రమంగా బదిలీ అయిందని రెవెన్యూ మంత్రి స్వయంగా సభలో వెల్లడించారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
ఎకరాకు కోటి రూపాయల చొప్పున లెక్కించినా ఇది కనీసం రూ. 23 లక్షల కోట్ల విలువైన ప్రజా సంపద అని చెప్పారు. రిజిస్ట్రేషన్ అనేది టైటిల్ డీడ్ కాదని, ప్రభుత్వం తలచుకుంటే వెంటనే రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఉన్నా, నెల రోజులు దాటినా ఒక్క ఎకరాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
బ్రిటిష్ కాలం నాటి 1908 రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరిస్తూ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సెక్షన్ 22ఏ కింద అసైన్డ్, ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్ భూములను మాత్రమే చేర్చాలి. కానీ, ధరణిలో 98,56,836 ఎకరాలు ఉంటే, భూభారతిలో ఏ ప్రాతిపదికన 25,518 ఎకరాలను (అందులో నాన్-అగ్రికల్చర్ 269 ఎకరాలు) తొలగించారో ప్రభుత్వం వెల్లడించలేదని బిజెపి నేత మండిపడ్డారు.
రాష్ట్రంలో 66,33,313 ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉండగా, 42,53,532 ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి చెప్పారని పేర్కొంటూ మిగిలిన 23,79,781 ఎకరాల అటవీ భూమి వివరాలు ఎక్కడున్నాయో ప్రభుత్వం వద్ద సమాధానం లేదని విమర్శించారు. 5,12,792 ఎకరాల దేవాదాయ, వక్ఫ్ భూములు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉందని దాటవేస్తున్నదే తప్ప, ఆ భూములు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయా లేక కబ్జాలకు గురయ్యాయా అన్నది స్పష్టం చేయడం లేదని తెలిపారు.
సీతారాంపూర్‌లోని 1,200 ఎకరాల దేవాదాయ భూమిని గతంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెడితే నేటికీ రక్షణ చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు కోటి 79 లక్షల ఎకరాల విలువైన భూదాన్ భూములుండగా, వాటిని 22ఏ జాబితాలో ఎందుకు ప్రదర్శించలేదో స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. ధరణి పోర్టల్‌ను విదేశీ సంస్థల చేతుల్లో పెట్టి, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఆర్డీవో/కలెక్టర్ల వద్ద అప్పీలు చేసుకునే హక్కు లేకుండా 18 లక్షల ఎకరాల పాస్ పుస్తకాలను పార్ట్-బిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాదా బైనామీ క్రమబద్ధీకరణ కింద 9.24 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 120 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించి మిగతావి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. భూభారతి కింద 3,73,000 ఎకరాల చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులు, నాలా కన్వర్షన్ అయిన లేఅవుట్లు, రెరా అనుమతులు ఉన్న కాలనీలను అక్రమంగా 22ఏ జాబితాలో చేర్చి సాధారణ ప్రజలను రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ పైరవీకారులతో సెటిల్మెంట్లు చేయిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జీవనోపాధి కోసం ఇచ్చిన 24,63,940 ఎకరాల అసైన్డ్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సింది పోయి, వాటిని క్రమబద్ధీకరించే పేరుతో కొత్త జీవో తెచ్చి బడాబాబులకు కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి సంపాదనకు ప్రధాన వనరుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుఆరోపించారు. క్రమబద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగి, 20 నుంచి 30 ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్లను సైతం రాత్రికి రాత్రే నిబంధనలకు విరుద్ధంగా 22-ఏ జాబితాలో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పేర్లను తొలగించుకోవాలంటే బాధితులు భారీగా లంచాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, ఇందుకు నిదర్శనంగానే ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కుకుంటున్నారని గుర్తుచేశారు.
More Stories
నేహా బోరా ‘బంగ్లాదేశ్ మార్గం చూపింది’ వ్యాఖ్యలపై దుమారం
పాక్ నుండి జరిగే ఏ ఉగ్రవాద చర్యకైనా బలమైన ప్రతిస్పందన
అరాచకత్వానికి ప్రతీకగా రాహుల్ గాంధీ