రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని పేర్కొంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గత నాలుగు నెలల్లోనే రూ.35 వేల కోట్లు (నిమిషానికి రూ.20 లక్షలు) అప్పు చేస్తోందని చెప్పారు.
జీఎస్‌డీపీలో 50 శాతానికి పైగా అప్పులున్న తెలంగాణ ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు వెళ్తోందని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ (సుమారు రూ.15 వేల కోట్లు), ఆరోగ్యశ్రీ (దాదాపు రూ.15 వేల కోట్లు), రిటైర్మెంట్ బెనిఫిట్స్ (సుమారు రూ.8 వేల కోట్లు), ఉద్యోగుల బకాయిలు, సర్పంచులు, మున్సిపాలిటీలు మరియు సింగరేణి బకాయిలు (రూ.60 వేల కోట్లు) చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో గుంతల రోడ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే, ఉన్న నగరానికే దిక్కులేకుండా పోతుంటే “ఫ్యూచర్ సిటీ”, “మూసీ రివర్ ఫ్రంట్”, “కొడంగల్ లిఫ్ట్” పేరుతో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లే డిజైన్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, బిల్లులను నిర్ణయించే విపరీత ధోరణి నడుస్తోందని మండిపడ్డారు.
సింగరేణి విషయంలో కూడా ప్రయోజనాల కంటే కమిషన్లపైనే దృష్టి పెట్టారని చెబుతూ తాడిచర్ల బొగ్గు బ్లాక్ వ్యవహారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గతంలో చేసిన రూ.20 వేల కోట్ల కుంభకోణం ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లను రోడ్డుపైకి తెచ్చే పరిస్థితిని సృష్టించిందని ఆరోపించారు.
30–40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు కూడా శాతం ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి భార్యను కలిసిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి 10 శాతం కమిషన్ ఇస్తేనే బిల్లు క్లియర్ అవుతుందని చెప్పినట్లు వార్తలు రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, బిల్లులు క్లియర్ కావాలంటే 30 శాతం కమిషన్ ఇవ్వాలని అడుగుతున్నారని, సెక్రటేరియట్‌లోనే డిప్యూటీ సీఎం చాంబర్ ముందు చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం బీజేపీ ప్రతిపక్షంగా ఇందిరా చౌక్‌లో పోరాటం చేసిందని గుర్తుచేశారు.
గత రెండున్నర సంవత్సరాలుగా సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టు ఆదేశాలు, 500–600 కంటెంప్ట్ కేసులు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీఎస్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైడ్రా కమిషనర్ వంటి ఉన్నతాధికారులు కోర్టు చుట్టూ తిరుగుతూ వారెంట్లు ఎదుర్కొనే ఆందోళనకర పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
అధికారులు చట్టాన్ని, రూల్ ఆఫ్ లాను మర్చిపోయి కేవలం మంత్రుల ఒత్తిళ్లకు లొంగి చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారమే పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 10 ఏళ్లు పాలించే ధైర్యం ఉంటే వెంటనే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల ఎన్నికలు పెట్టాలని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. అవినీతి, కమిషన్ల వ్యవహారాలపై రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, ఏసీబీ, సంబంధిత అధికారులు సుమోటోగా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు.
More Stories
సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు!
పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
అసెంబ్లీకి ఏబీవీపీ భారీ నిరసన ర్యాలీ.. రాంచీలో ఉద్రిక్తత