విద్యుత్ కారుగా తిరిగి రానున్న టాటా నానో

విద్యుత్ కారుగా తిరిగి రానున్న టాటా నానో
`లక్ష రూపాయలకే కారు’ అంటూ భారతీయ వాహన రంగంలో నానో కారు ద్వారా టాటా సంస్థ సృష్టించిన సంచలనం తెలిసిందే. అనుకున్నంత విజయం సాధించకపోయినా భారతీయులపై నానో కారు చూపిన ప్రభావాన్ని మర్చిపోలేం. సామాన్యుడికి కూడా తక్కువ ధరలోనే కారు అందించాలనే టాటా ప్రయత్నం కలకలం రేపింది. 2009లో మార్కెట్లోకి విడుదలైన ఈ కారు 2018లో నిలిచిపోయింది. 

ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన ఈ కారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈసారి సరికొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా త్వరలో టాటా నానో ఈవీ రాబోతుందనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈవీల హవా నడుస్తోంది. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కూడా ఈవీ మోడల్‌లో వస్తున్నాయి. ఈవీ కార్లకు మంచి డిమాండ్ ఉంటోంది.

అందులోనూ టాటా నానో తరహా ఈవీ, కాంపాక్ట్ కార్లు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నకార్లను కోరుకుంటున్నారు. అందువల్ల నానో ఈవీకి ఇదే మంచి సమయం అని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. నానో ఈవీ అందుబాటులోకి వస్తే అనేక రకాలుగా ఉపయోగం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ కారు చిన్న సైజ్‌లో ఉంటుంది. దీంతో సిటీ రోడ్ల మీద సులభంగా తిరగడానికి వీలుంటుంది. అలాగే, తక్కువ స్పేస్‌లోనే సులభంగా పార్క్ చేయొచ్చు. ఈవీ కాబట్టి, ఖర్చు తక్కువ. మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా తగ్గుతాయి. దీంతో టూ వీలర్స్ నుంచి చాలా మంది ఈజీగా నానో ఈవీకి మారిపోతారు. అందులోనూ మొదటిసారి కార్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.  

అలాగే, బెటర్ పెర్ఫామెన్స్, మంచి ఇంటీరియర్, లేటెస్ట్ స్మార్ట్ టెక్నాలజీ వంటివి జత చేస్తే చేస్తే నానోకు తిరుగుండదని భావిస్తున్నారు. ఇక, టాటా ఇప్పటికే ఈవీ కార్లలో దూసుకెళ్తోంది. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీతోపాటు కొన్ని ఎస్‌యూవీలను కూడా విడుదల చేయగా,   ఇవన్నీ మంచి విజయం సాధించాయి. మరి టాటా నానో ఈవీ కూడా ఈ జాబితాలోకి వెళ్తుందేమో చూడాలి. అయితే, నానో ఈవీపై టాటా సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.