2024 ఆగస్టులో పదవీచ్యుతురాలైనప్పటి నుండి భారతదేశంలోనే నివసిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, “నా జీవితం వ్యక్తిగత భద్రత అనే లెక్కలకు ఎప్పుడో అతీతంగా సాగిపోయింది” అని ప్రకటిస్తూ, తాను తన దేశానికి తిరిగి వచ్చి, అక్కడి ప్రజలకు అండగా నిలబడి, వారి జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడాలని యోచిస్తున్నట్లు బుధవారం తెలిపారు.
ఎప్పుడు తిరిగి రావాలని యోచిస్తున్నారని అడగ్గా, హసీనా 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, “డిసెంబర్ మా విజయ మాసం, అందుకే నేను డిసెంబర్ నెలలో తిరిగి వెళ్లాలనుకుంటున్నాను” అని చెప్పారు. ఆమె బంగ్లాదేశ్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఆమె పార్టీ అయిన అవామీ లీగ్‌పై నిషేధం విధించబడింది.
న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆడియో లింక్ ద్వారా విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆమె ఇలా పేర్కొన్నారు: “నాకు ఎలాంటి గతి పట్టినా, నేను నా ప్రజల వద్దకు తిరిగి వస్తాను. నా ప్రియమైన దేశ ప్రజలు బాధపడుతుండగా నేను దూరంగా ఉండలేను. నన్ను నిర్బంధించవచ్చని నాకు తెలుసు. నన్ను జైలుకు పంపవచ్చు. కల్పిత కేసులలో తీర్పులను అమలు చేయడానికి వారు ప్రయత్నించవచ్చు, కానీ ప్రజల పట్ల నా కర్తవ్యాన్ని భయం నిర్ణయించలేదు. నా జీవితం వ్యక్తిగత భద్రత లెక్కలకు అతీతంగా ఎప్పుడో సాగిపోయింది… వారు నన్ను జైలులో పెట్టవచ్చని లేదా చంపవచ్చని నాకు తెలుసు.”
భారత్ విడిచి వెళ్లే ముందు ఏదైనా తటస్థ పక్షం లేదా దేశం ద్వారా మధ్యవర్తిత్వం కోరుకుంటున్నారా? అని అడిగినప్పుడు, తనకు కేవలం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని మాత్రమే ఉందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది ముఖ్యం కాదని హసీనా బదులిచ్చారు.‘‘బంగ్లాదేశ్ ప్రజల కోసం జీవితమంతా గడిపి, ఆ దేశం నుంచి బహిష్కరించిన వ్యక్తిగా మట్లాడుతున్నా. నేను నా దేశం, ప్రజల నుంచి వేరుకాలేదు. నేను బంగ్లాదేశ్ తప్పకుండా తిరిగి వెళ్తా. నేను వెళ్లేది అధికారం కోసం కాదు. బంగ్లాదేశ్‌ను సరైన దారిలో పెట్టేందుకే. అభివృద్ధి, లౌకికవాదం దిశగా నడిపించేందుకే” అని స్పష్టం చేశారు.
“వాళ్లు నన్ను జైల్లో పెడతారు. లేదా చంపుతారు అని కూడా తెలుసు. వాటికి నేను భయపడటం లేదు. నా కర్తవ్యాన్ని అవి ఆపలేవు. 2024 జూలై, ఆగష్టులో జరిగిన విద్యార్థి ఉద్యమం శాంతియుతమైనది కాదు. ప్రారంభం నుంచి విద్యార్థుల ఉద్యమాన్ని చర్చలు, చట్టపరమైన అంశాలు, సహనంతో పరిష్కరించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, సంస్కరణల పేరుతో చేపట్టిన విద్యార్థుల ఉద్యమాన్ని కొన్ని సంఘాలు హింసాత్మకంగా మార్చి, తమ రాజకీయ పావుగా వాడుకున్నాయి” అని ఆమె ఆరోపించారు.
“ఇది ప్రణాళిక ప్రకారం చేసిన ఒక ఉద్యమం. ఉన్నట్లుండి జరిగింది కాదు. ఈ విషయాన్ని ముహమ్మద్ యూనస్ కూడా చెప్పాడు. కొంతమంది ఆదేశాలకు అనుగుణంగా జరిగింది. బ్యాలెట్ బాక్స్‌కు అతీతంగా అధికారం చేజిక్కించుకునేందుకు సాగిన ఉద్యమం’’ అని షేక్ హసీనా విమర్శించారు. గత రెండేళ్లుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే తనకు ఆవేదన కలిగిందని పేర్కొంటూ తాము ఎన్నో ఏళ్లుగా నిర్మించిన బంగ్లాదేశ్ ఇబ్బందుల్లో ఉందని, దీనికోసమా 1972లో 30 లక్షల మంది త్యాగం చేశారు? అంటూ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమమైనదని తాను అభివర్ణించిన ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, ఆ ఘటనలపై విచారణను నిలిపివేసిందని, పూర్తి వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకుందని హసీనా ఆరోపించారు. అలాగే, “ప్రజాస్వామ్యం, న్యాయం కోసం సాగిస్తున్న పోరాటంలో” బంగ్లాదేశ్ ప్రజలకు అండగా నిలవాలని ఆమె అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా, తన ప్రవాసానంతర బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితులపై నిర్భయంగా వార్తలు అందించిన పాత్రికేయులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌ను హసీనా ఒక “గొప్ప మిత్రదేశం”గా ఆమె అభివర్ణించారు. “బంగ్లాదేశ్ ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచింది, ఆశ్రయం కల్పించింది – అది 1971 అయినా లేదా 1975 అయినా సరే. ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరుగా ఉండవచ్చు, కానీ భారత్ ఎప్పుడూ గొప్ప మిత్రదేశంగానే ఉంది. ఇకముందూ అలాగే ఉంటుందని నాకు తెలుసు” అని ఆమె భరోసా వ్యక్తం చేశారు.
హసీనా మీడియా సమావేశం పట్ల బంగ్లాదేశ్ ఆగ్రహం
మరోవంక, ఆమె మీడియా సమావేశంపై తీవ్రంగా స్పందిస్తూ, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఇలా పేర్కొంది: “పరారీలో ఉన్న, నరమేధం కేసులో దోషిగా తేలిన షేక్ హసీనాకు ఈ సాయంత్రం న్యూఢిల్లీలో మీడియాతో ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనడానికి అనుమతించడం పట్ల బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ సందర్భంగా ఆమె, ఆమె అనుచరులు బంగ్లాదేశ్ దేశంపైనా, దాని ప్రజలపైనా తీవ్రమైన విషం చిమ్మారు.”
“ఈ సంఘటన వల్ల మన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై పడబోయే పరిణామాల గురించి భారత ప్రభుత్వానికి ముందుగానే ఆందోళనలు తెలియజేసినప్పటికీ, ఈ బహిరంగ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం పట్ల ఢాకా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది,” అని ఆ ప్రకటనలో జోడించింది.
ఢాకా భారతదేశంతో నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నప్పటికీ, “…ఏ సాకుతోనైనా ఆమెకు (హసీనాకు) మీడియాతో బహిరంగంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించడం మా ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుంది. బంగ్లాదేశ్-భారత్ మధ్య సామరస్యపూర్వక ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి హానికరం,” అని ఆ ప్రకటన పేర్కొంది.
కాగా, మంగళవారం, ఢాకాలో వ్యక్తమవుతున్న ఆందోళనలను పరిష్కరించేందుకు చర్య తీసుకుంటూ, హసీనా మీడియాతో జరిపిన సంభాషణలో వ్యక్తపరిచిన ఏ అభిప్రాయంలోనూ తమకు ప్రమేయం లేదని, దానిని తాము సమర్థించబోమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
More Stories
ఆర్ధిక పునర్జీవనంతో జమ్మూ కాశ్మీర్ .. సంక్షోభంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్
భారత్ మయన్మార్‌తో భూభాగ మార్పిడి చేసుకోనుందా?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఉద్దేశ్యం లేదు