ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన పొగాకు వ్యాపారితో పాటు మరొ ఇద్దరిని అపహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాను గుజరాత్‌లో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఎనిమిది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన మంగళవారం పట్టుబడ్డారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు ముబషీర్ ఏ1 నిందితుడిగా ఉన్నారు.
ముబషీర్‌ను సైతం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే రోజు పోలీసులకు చిక్కడం గమనార్హం. ఇటీవల పొగాకు లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ముస్తఫా కుమారుడు, అతడి అనుచరులు అడ్డుకున్నారు. పొగాకు వ్యాపారితో పాటు మరొకరిని బలవంతంగా కిడ్నాప్ చేసి, నిర్బంధించారు.
బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌కు గురైన వారిని రక్షించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. అంతేకాకుండా కిడ్నాప్‌లో ముస్తఫా హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కూడా కిడ్నాప్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు కావడంతో ముస్తఫా పోలీసులకు దొరకకుండా రాష్ట్రం విడిచి పారిపోయారు. నేరుగా గుజరాత్ చేరుకున్నారు.
వడోదరలో ఉంటున్న తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నారు. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున వడోదరకు చేరుకున్నారు. ఆ ఇంటిని చుట్టుముట్టారు. నిద్రలో ఉన్న ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వెంటనే ముస్తఫాను పోలీసులు స్థానిక వడోదర కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల ఏడో తేదీ లోపు ఏపీలోని న్యాయస్థానంలో ఆయనను హాజరుపరచాలని వడోదర కోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తూ ట్రాన్సిట్ వారెంట్ మంజూరు చేశారు. దీంతో ముస్తఫాను పోలీసులు రోడ్డు మార్గాన నూజివీడుకు తీసుకువస్తున్నారు.
తన తండ్రి ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం ముబషీర్‌కు తెలియడంతో అతను అక్కడి నుంచి వెంటనే తప్పించుకునేందుకు కారులో శంషాబాద్ విమానాశ్రయం వైపు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్‌ను ట్రాక్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో కారును అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.
ముబషీర్‌ను నూజివీడు కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్టును సిద్ధం చేస్తున్నారు. పోలీసులు వారి ఫోన్లపై నిఘా పెట్టారు. వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకునేవారు. కానీ, పోలీసులు వచ్చేలోపే తండ్రీకొడుకులు అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా రెండు, మూడు సార్లు త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.
గుర్తుపట్టకుండా ఉండేందుకు ముస్తఫా తన వేషధారణను పూర్తిగా మార్చేశారు. ఎప్పుడూ తెల్ల దుస్తుల్లో కనిపించే ఆయన, రంగుల చొక్కాలు ధరించారు. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చివరకు గుజరాత్ చేరుకున్నారు. అయినా సరే పోలీసుల నిఘా వలయం నుంచి తప్పించుకోలేక కటకటాల పాలయ్యారు.

More Stories
ఉగ్రనిధుల కేసులో హక్కుల కార్యకర్త పర్వేజ్, ఐపీఎస్ అరవింద్ నేగి
జమ్మూకశ్మీర్‌లో నూతన శకం.. 75 శాతం తగ్గిన ఉగ్రదాడులు
ఇథనాల్ ఉత్పత్తి విస్తరణకు రైతు నాయకుల మద్దతు