కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి

కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి
 
కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల భారీ ఆస్తి నష్టం సంభవించింది. రహదారులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇండ్లు ధ్వంసం కాగా, ఐదు వేల మంది ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 
 
ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా ఇంకా పూర్తిస్థాయిలో పరిస్థితులు అదుపులోకి రాలేదు. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి  వీడీ సతీషన్ ప్రజలకు, అధికారులకు సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారత వాతావరణ శాఖ కేరళలోని 12 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
 
అలాగే, అత్యవసర మెడిసిన్ సిద్ధంగా ఉంచాలని సూచిచారు. పర్వత ప్రాంతాల్లో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో తాజా వర్షాల కారణంగా 27 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా, 196 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి 5792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి కోసం 209 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు, వ్యర్థాలు, మురికి నీరు తొలగిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాల్ని కూడా అధికారులు చేపట్టారు.  పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆరోగ్య రంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అన్ని ఆసుపత్రులలో అత్యవసర ఔషధాల నిల్వలను అందుబాటులో ఉంచామని వెల్లడించింది. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో వైద్య బృందాలను నిరంతరం అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాలు, వరదల వల్ల సంభవించే అంటవ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి మురళీధరన్ తెలిపారు. పాడైన రోడ్లను కూడా మరమ్మతులు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్ వెల్లడించారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) సిబ్బందితోపాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కేరళలోని 12 జిల్లాలకు ఐఎండీ ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే, ఈ జిల్లాల్లో కనీసం 115 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.