ప్రధాని మోదీపై దుర్భాషలు భారతదేశానికి అవమానం

ప్రధాని మోదీపై దుర్భాషలు భారతదేశానికి అవమానం
ప్రధాని నరేంద్ర మోదీపై దుర్భాషలు వాడటం భారతదేశానికి అవమానకరం అని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (ఎఐఐఓ) చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ స్పష్టం చేశారు. ఇటీవలి నిరసనల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దూషణలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ప్రజలకు తమ అసమ్మతిని తెలిపే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, నిరసనలు హుందాతనంతో కూడిన పరిమితులకు లోబడి ఉండాలని, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించకూడదని లేదా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు.
 
ఒక వీడియో సందేశంలో ఆయన ఇలా అన్నారు: “నాకు కూడా ఒక బాధ్యత ఉంది, ఒక ఇమామ్‌గా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలనుకుంటున్నాను. గత నెలలో, జూలై 20న ప్రారంభమైన నిరసనలను దేశం, ప్రపంచం మొత్తం చూశాయి. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అందులో తప్పు ఏమీ లేదు. కానీ అది హుందాతనంతో కూడిన పరిమితులకు లోబడి జరగాలి.”
 
నిరసనల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ ఇల్యాసీ ఇలా పేర్కొన్నారు: “నిరసనల సమయంలో ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైంది. ప్రభుత్వ బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్లను దిగ్బంధించారు. విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తి మనందరిదీ. కాబట్టి ఇటువంటి చర్యలు చివరికి ప్రజలకే హాని కలిగిస్తాయి.” 
 
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని నొక్కిచెప్పిన ఆయన, అసమ్మతిని వ్యక్తం చేయడానికి, దూషణలకు దిగడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని ఆయన స్పష్టం చేశారు. “కుటుంబంలో కూడా వాదనలు జరుగుతుంటాయి. అయితే, కొన్ని విషయాలతో ఏకీభవించనంత మాత్రాన తల్లిదండ్రులను దూషించడం మొదలుపెట్టరు కదా. సోషల్ మీడియా కాలంలో ఏ విషయం అయినా ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుతుందని అందరూ చూశారు” అని తెలిపారు. 
 
దేశ ప్రధాన మంత్రిని, ఆయన దివంగత తల్లిని ఉద్దేశించి కొందరు యువకులు దూషణలకు దిగడం, అనుచిత పదజాలం వాడటం బాధాకరం అని పేర్కొంటూ  మన సంస్కృతి, సంప్రదాయాలు మనకు నేర్పేది ఇదేనా? అని ఇల్యాసీ ప్రశ్నించారు. చీఫ్ ఇమామ్ అభిప్రాయం ప్రకారం, నిరసనల సమయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు కేవలం ప్రధాన మంత్రి ప్రతిష్టకే కాకుండా, దేశం మొత్తానికి చెడ్డ పేరు తెచ్చాయి. 
 
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎలాంటి పదాలు వాడారో ప్రపంచం మొత్తం చూసింది. అయితే, దీనివల్ల ప్రధానమంత్రిలో కాదు, భారతదేశానికి నష్టం జరిగింది. ఇది దేశానికే అవమానం,” అని ఆయన జోడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు భారతదేశంలో వచ్చిన మార్పును, అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అంతర్జాతీయంగా సంపాదించుకున్న గౌరవాన్ని తాను స్వయంగా చూశానని ఆ మత పెద్ద పేర్కొన్నారు.
 
“ఈ గౌరవం కేవలం నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతున్నది అని నేను అనడం లేదు. ఇది భారతదేశానికి దక్కిన గౌరవం. నేడు నరేంద్ర మోదీ మన దేశానికి ఎన్నికైన ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన 37 దేశాల నుండి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రికి కూడా ఇటువంటి గుర్తింపు లభించలేదు,” అని ఇల్యాసీ గుర్తు చేశారు. 
 
ప్రధానమంత్రి పట్ల ఉపయోగించిన భాషపై అసహనం వ్యక్తం చేస్తూ, అటువంటి ప్రవర్తన భారతదేశ సాంస్కృతిక, నైతిక విలువలకు అద్దం పడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. “ఆయనను అవమానిస్తూ, దూషించే భాషను వాడటం మన విలువలు నేర్పే పద్ధతా? అదేనా మన సంస్కృతి? మనం ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం?” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
 
“నేను ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్నాను.ఎందుకంటే దేశ ప్రధానమంత్రిని అవమానించేలా ప్రజలు వాడిన భాష భారతదేశాన్నే అవమానించినట్లయింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు “దుష్ప్రవర్తన కలిగిన యువకులు” తన పట్ల, తన దివంగత తల్లి పట్ల కూడా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని, ఇది ఏ నాగరిక సమాజానికీ తగని చర్య అని ప్రధానమంత్రి మోదీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో సందేశం ద్వారా పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.