భోగాపురం విమానాశ్రయంకు ప్రధాని మోదీ నేడే ప్రారంభోత్సవం!

భోగాపురం విమానాశ్రయంకు ప్రధాని మోదీ నేడే ప్రారంభోత్సవం!
 
* ఏపీ పర్యటనలో రూ 17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన విమానయానం, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ప్రసారం, రహదారి మౌలిక సదుపాయాలు, యువజన అభివృద్ధి వంటి రంగాలకు చెందిన రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారు. 
ఆ తర్వాత అదే రోజు, కర్ణాటకలోని మైసూరులో గల శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం – వివేక స్మారకను కూడా ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి తన పర్యటనను ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్‌ను పరిశీలించి, ఆ తర్వాత లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడా. 
 
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో రూ.5,640 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, సంవత్సరానికి ఆరు మిలియన్ల (60 లక్షల) మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధిని ప్రోత్సహిస్తూ, ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. 
 
ఈ టెర్మినల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బిఐఎం), ఎయిర్‌సైడ్ 4.0 సిస్టమ్స్, ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎపిఓసి), బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ వంటి అధునాతన సాంకేతికతలను అనుసంధానించారు.
 
సుస్థిరతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ విమానాశ్రయంలో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, వర్షపు నీటి సేకరణ, శక్తి సామర్థ్యం గల హెచ్ విఎసీ వ్యవస్థలు, లైటింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ టెర్మినల్‌ను గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.
 
దీనిని యు.ఎస్. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యుఎస్ జిబిసి)లో నమోదు చేశారు. వాస్తుపరంగా, ఈ టెర్మినల్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం నుండి ప్రేరణ పొందింది. దీని పైకప్పు ఆకృతి సాంప్రదాయ చుట్టిలు కుటీరాలు, అరకు లోయ ప్రకృతి దృశ్యాలు, ఎగిరే చేప రూపాన్ని ప్రతిబింబిస్తుంది. 
 
ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం
 
ఈ పర్యటన సందర్భంగా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన ఏపిఎసిటి  భాగస్వామ్యంతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 460 కోట్లకు పైగా పెట్టుబడితో విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తున్న  ఏఎస్ఐపి  సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. భారత సెమీకండక్టర్ మిషన్ కింద ఆమోదం పొందిన ఇది, ఆంధ్రప్రదేశ్  మొట్టమొదటి సెమీకండక్టర్ తయారీ కేంద్రం కానుంది. 
 
ఇది ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్‌లను ఉత్పత్తి చేయడంతో పాటు, అధిక నైపుణ్యం గల ఉపాధిని కల్పించి, రాష్ట్రంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. 
 
పునరుత్పాదక ఇంధన ప్రసార ప్రాజెక్టులు
 
పవర్‌గ్రిడ్ సంస్థ సుమారు రూ. 5,550 కోట్ల పెట్టుబడితో ఒక ప్రత్యేక ప్రయోజన వాహనంద్వారా అమలు చేస్తున్న కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్ (ఆర్ఈజెడ్) – మొదటి దశ (4.5 జి డబ్ల్యు) ఏకీకరణ ప్రసార వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి అదనంగా, సుమారు రూ. 3,550 కోట్ల వ్యయంతో నిర్మించిన కర్నూలు పవన విద్యుత్ జోన్/సౌర విద్యుత్ జోన్ – పార్ట్ ఎ, పార్ట్ బి ప్రసార వ్యవస్థను, అలాగే రూ. 820 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన అనంతపురం (2,500 మెగావాట్లు), కర్నూలు (1,000 మెగావాట్లు) సౌర విద్యుత్ జోన్‌ల ప్రసార పథకాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. 
 
ఈ ప్రాజెక్టులు జాతీయ గ్రిడ్ ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని తరలించి, ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తాయి. తద్వారా స్వచ్ఛమైన విద్యుత్ లభ్యతను మెరుగుపరుస్తూ, భారతదేశ ఇంధన పరివర్తన మరియు డీకార్బనైజేషన్ లక్ష్యాలకు మద్దతునిస్తాయి. 
 
రూ. 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు
 
ప్రధానమంత్రి మోదీ రూ. 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసి, వాటికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభించనున్న ప్రాజెక్టులలో ఎన్ హెచ్-365బిజీలోని రెచర్ల–గురువాయ్‌గూడెం, గురువాయ్‌గూడెం–దేవరపల్లె సెక్షన్లతో పాటు, ఎన్ హెచ్-67పై తాడిపత్రి బైపాస్ కూడా ఉన్నాయి. ఎన్ హెచ్-565లోని పెంచలకోన–యెర్పేడు సెక్షన్‌లో లింగసముద్రం వద్ద నిర్మించనున్న హై-లెవల్ బ్రిడ్జికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. 
 
ఈ జాతీయ రహదారి ప్రాజెక్టులు రద్దీని తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, విశాఖపట్నం నుండి హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి చేస్తాయని భావిస్తున్నారు. 
 
మైసూరులో వివేకా స్మారకం 
 
కాగా, శనివారం సాయంత్రం, ప్రధానమంత్రి కర్ణాటకలోని మైసూరులో ఉన్న శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం – వివేకా స్మారకాన్ని ప్రారంభించేందుకు ప్రయాణించనున్నారు. 1892 నవంబర్‌లో స్వామి వివేకానంద మైసూరులో చేసిన చారిత్రాత్మక పర్యటనకు గుర్తుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. 
 
ఆ పర్యటనలో ఆయన పండితులతో సంభాషించి, మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ మద్దతును పొందారు. వారి పోషణతోనే 1893లో చికాగోలో జరిగిన ‘పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్’లో ఆయన పాల్గొనగలిగారు. చారిత్రాత్మక నిరంజన మఠంలో 81,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రంలో 4-డి అనుభవ కేంద్రం, ప్రదర్శనశాల, సుమారు 700 మంది కూర్చునే వీలున్న యాంఫిథియేటర్, తరగతి గదులు, సమావేశ మందిరాలు, గ్రంథాలయం, ధ్యాన, యోగా మందిరం, పఠన గది, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం సౌకర్యాలు ఉన్నాయి.