పంజాబ్‌లో పేపర్‌ లీకేజీలపై ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన

పంజాబ్‌లో పేపర్‌ లీకేజీలపై ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనకారుల డిమాండ్లు నెరవేరాయి. ఇప్పుడు ఈ అంశం పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి చుట్టుకుంది. ఇక్కడ ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేస్తుంది. 
 
పంజాబ్‌లో కూడా ఇటీవల వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీజేపీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రాతోపాటు పలువురు ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 
 
పంజాబ్‌లోని భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల పంజాబ్‌లో విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ అంటోంది. అలాగే, ఈ లీకేజీలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కూడా బీజేపీ కోరుతోంది.  నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పేపర్ లీక్‌ల విషయంలో ఆప్ కేంద్రాన్ని జవాబుదారీతనం కోరిందని, కానీ పంజాబ్‌లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మౌనం వహించిందని మల్హోత్రా ఆరోపించారు. 
 
“జాతీయ స్థాయిలో పేపర్ లీక్‌ల సమస్య తలెత్తినప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేసి, నైతికత, జవాబుదారీతనం గురించి మాట్లాడింది. కానీ పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, 12వ తరగతి ఆంగ్ల పరీక్ష, నియామక పరీక్షలతో సహా పంజాబ్‌లో పలుమార్లు పేపర్ లీక్‌లు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత, ఆ పార్టీ మౌనం వహించడానికే మొగ్గు చూపింది,” అని ఆయన పేర్కొన్నారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతో ప్రచారం చేసుకున్న తన “విద్యా విప్లవాన్ని” “పేపర్ లీక్ విప్లవంగా” మార్చిందని ఆయన ఎద్దేవా చేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రిని తొలగించకపోతే, బీజేపీ తమ ఆందోళనను ఢిల్లీ దాటి పంజాబ్‌లోకి కూడా తీవ్రతరం చేస్తుందని మల్హోత్రా హెచ్చరించారు. ఇదే సమయంలో పంజాబ్‌లో కూడా పేపర్ లీకేజీలపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ కోరుతోంది. గత ఐదేళ్లలో పంజాబ్‌లో ప్రధాన పరీక్షలకు సంబంధించి ఆరు లీకేజీలు జరిగాయి. 
 
ఈ నెల 19న జరగాల్సిన ఫార్మసీ పరీక్షకు సంబంధించిన పేపర్ కూడా లీకైంది. పరీక్షల నిర్వహణలో ఎన్నో మోసాలు, అవకతవకలు జరిగాయి. ఈ లీకేజీలకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో పంజాబ్‌లో పేపర్ లీకేజీలపై సీజేపీ స్పందించకపోవడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. అక్కడ సీజేపీ ఆధ్వర్యంలో ఎందుకు ఆందోళనలు చేయడం లేదని ప్రశ్నిస్తోంది.