పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏమీ లేదు

పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏమీ లేదు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను ‘పాకిస్థానీ కశ్మీర్’గా అమెరికా వార్తాపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తన కథనంలో అభివర్ణించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుందని పునరుద్ఘాటించింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ రాసిన కథనం తప్పుదోవ పట్టించేది, సరికానిదిగా అభివర్ణించింది. పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏమీ లేదని, పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. అలాగే కశ్మీర్ విషయంలో దేశ దీర్ఘకాలిక వైఖరిని అమెరికాలో భారత కార్యాలయం పునరుద్ఘాటింటించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్ గతంలోనూ, ఇప్పుడు కూడా భారతదేశంలో అంతర్భాగాలేనని స్పష్టం చేసింది. ఇవి దేశంలో విడదీయరాని భూభాగాలగానే ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొంది. 

ఈ భూభాగాల్లోని కొన్ని భాగాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని తెలిపింది. పీఓకేలోని ప్రజలపై పాకిస్థాన్ హింసను కొనసాగిస్తోందని ఆరోపించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల జరిగిన అశాంతి, స్థానిక ఎన్నికలపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన ఒక నివేదిక నేపథ్యంలో భారత్ నుంచి ఈ స్పందన వచ్చింది. పీఓకేలోని ప్రజలపై పాకిస్థాన్ హింసను కొనసాగిస్తోందని ఆరోపించింది.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల జరిగిన అశాంతి, స్థానిక ఎన్నికలపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన ఒక నివేదిక నేపథ్యంలో భారత్ నుంచి ఈ స్పందన వచ్చింది. పోలీసుల దురాగతాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పౌర హక్కుల సంస్థ అయిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సభ్యులతో భద్రతా దళాలు ఘర్షణ పడటంతో పీఓకేలోని మీర్‌పుర్‌లో హింస చెలరేగిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. 

ఈ తాజా ఘర్షణల్లో తుపాకీ గాయాలతో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారని నివేదించింది. ఈ హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరపాలని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ డిమాండ్ చేసినట్లు వెల్లడించింది. వారాల తరబడి కొనసాగుతున్న హింస అనేక మంది మరణాలకు దారితీసిందని, ఆ ప్రాంతమంతటా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపిందని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో తమ సభ్యులలో చాలా మంది మరణించారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేసిన వాదనలను కూడా ‘ది న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో ప్రస్తావించింది.

న్యూయార్క్ టైమ్స్ కథనంలోని ఘటనల కంటే దాని శీర్షికలో ఉపయోగించిన ‘పాకిస్థానీ కశ్మీర్’ అనే పదమే భారత్ అభ్యంతరానికి ప్రధాన కారణంగా నిలిచింది. కశ్మీర్‌కు సంబంధించి ఉపయోగించే పదాలు కేవలం భాషా పరమైనవి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఎంతో సున్నితమైన అంశాలుగా ఉంటాయి.