ప్రపంచ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం పులుల సంరక్షణ అవసరాన్ని ప్రపంచానికి తెలియజేయడం, వాటి సంఖ్యను పెంపొందించడం మరియు సహజ నివాసాలను రక్షించడం. 2010లో రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ పులుల సదస్సులో 13 దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని ప్రకటించాయి. “స్థానిక గిరిజనులు, స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ పులుల భవిష్యత్తును సురక్షితం చేయడం” థీమ్ తో ఈ సంవత్సరం పులుల దినోత్సవం పాటిస్తున్నారు.
పులి భారతదేశపు జాతీయ జంతువు మాత్రమే కాకుండా, అటవీ పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక జీవి. ఇది ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండే మృగం కావడం వల్ల, అడవుల్లో జీవ వైవిధ్యాన్ని సమతుల్యంలో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పులులు ఉన్న అడవులు ఆరోగ్యకరమైన పర్యావరణానికి సూచికలు.
అయితే గత కొన్ని దశాబ్దాల్లో పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్రమ వేట, అటవీ నాశనం, నివాస ప్రాంతాల క్షీణత, మానవ–వన్యప్రాణి సంఘర్షణ వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలు. పులుల చర్మం, ఎముకలు, ఇతర భాగాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది.
ఈ సమస్యలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం 1973లో “ప్రాజెక్ట్ టైగర్”ను ప్రారంభించింది. ‘ప్రాజెక్ట్ టైగర్’ అత్యంత విజయవంతమైన సంరక్షణ కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. దీనివల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కఠినమైన రక్షణ చర్యలు, సహజ ఆవాసాల పునరుద్ధరణ కారణంగా రష్యాలో ‘అముర్’ పులుల సంఖ్య స్థిరపడింది. బలమైన ప్రభుత్వ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యం కారణంగా నేపాల్ కూడా విజయం సాధించింది. అక్కడ ఇటీవలి కాలంలో పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది.
పెద్దపులి స్వభావం, ఆవాసం, ఆహార అలవాట్లు
టెరిటరీ (సరిహద్దు పరిధి): సాధారణంగా ఒక్కో మగ పులి దాదాపు 50 నుండి 100 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ అటవీ ప్రాంతాన్ని తన సొంత సరిహద్దుగా ఏర్పాటు చేసుకుంటుంది. చెట్ల కాండాలపై గోళ్ల గుర్తులు వేయడం, మూత్రం ఆధారిత వాసనల ద్వారా తమ సరిహద్దులను ఇతర పులులు దాటకుండా సంకేతాలు ఇస్తాయి.
ఆహారం: పెద్దపులి ప్రధానంగా దుప్పులు, సాంబార్లు, అడవి పందులు, ఇతర శాకాహార జంతువులను వేటాడుతుంది. ఆహార లభ్యత సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లోనే పులులు తమ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాయి.
జీవన శైలి & అలవాట్లు: పులులు ఏకాంత ప్రియులు. పగటిపూట నిశ్శబ్దంగా దట్టమైన గుబుర్లు లేదా నీటి వనరుల వద్ద విశ్రాంతి తీసుకుని, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆహారం కోసం వేట సాగిస్తాయి. ఈత కొట్టడంలో కూడా ఇవి ఎంతో నైపుణ్యం కలిగినవి.
పాదముద్రల ద్వారా పులి లింగ నిర్ధారణ
అటవీ శాఖ అధికారులు, ట్రాకర్లు పులి పాదముద్రల కొలతలు, ఆకారాన్ని బట్టి అది మగ పులినా లేక ఆడ పులినా అనేది ఖచ్చితంగా అంచనా వేస్తారు.
* ఆడ పులి పాదముద్ర దీర్ఘచతురస్రాకారంలో కొద్దిగా పొడవుగా ఉంటుంది.
కాలి వేళ్ల గుర్తులు
* మగ పులి వేళ్ల గుర్తులు గుండ్రంగా, పెద్దవిగా ఉంటాయి.
* ఆడ పులి: వేళ్ల గుర్తులు కొద్దిగా సన్నగా, అండాకారంలో కోసుగా ఉంటాయి.
* మగ పులి ప్యాడ్ భాగం పెద్దదిగా ఉండి, కాలి వేళ్ల గుర్తుల మధ్య ఖాళీ తక్కువగా ఉంటుంది.
* ఆడ పులులకు అరికాల ప్యాడ్‌తో పోలిస్తే వేళ్ల గుర్తులు స్పష్టంగా, వేర్వేరుగా కనిపిస్తాయి.
పులుల గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు
• ప్రత్యేకమైన చారలు: ప్రతి పులి శరీరంపైన ఉన్న చారల అమరిక మనుషుల వేలిముద్రల లాగే ప్రత్యేకమైనది. ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు. కెమెరా ట్రాప్‌ల ద్వారా పులులను గుర్తించడానికి ఈ చారల అమరికే ఆధారం.
• చర్మంపై కూడా చారలు: పులికి ఉన్న చారలు కేవలం వెంట్రుకల పైన మాత్రమే కాదు, వాటి చర్మం మీద కూడా అదే రకమైన చారల డిజైన్ ఉంటుంది.
• చూపు, రాత్రి దృష్టి: రాత్రి వేళల్లో పులుల దృష్టి సామర్థ్యం మనుషుల కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
• గర్జన శక్తి: పెద్దపులి చేసే గర్జన దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
• నీటిపై ఇష్టం: సాధారణంగా పిల్లి జాతి జంతువులు నీటికి దూరంగా ఉంటాయి. కానీ పులులు నీటిలో ఈత కొట్టడాన్ని చాలా ఇష్టపడతాయి. ఎండవేడి నుండి ఉపశమనం పొందడానికి గంటల తరబడి నీటి గుంటల్లో లేదా నదుల్లో గడుపుతాయి.
ఏలూరు జిల్లాలోని అటవీ శాఖ పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పాపికొండలు అభయారణ్యం పరిధిలో పులుల సంచారం నమోదవుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో రెండు పులులను గుర్తించారు. ఇటీవల మరొక కొత్త పులి ఈ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ పులి మతంగిమెట్టా ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలో సంచరిస్తున్నట్లు అధికారులు నిరంతరం ట్రాకింగ్ చేస్తున్నారు.
మానవ–వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించేందుకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రజల భద్రతను కాపాడటంతో పాటు వన్యప్రాణులను కూడా రక్షిస్తున్నాయి.
పులులను ఎందుకు కాపాడాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం & పాపికొండలు నేషనల్ పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
• పులుల గణన: పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలోని ఏలూరు, చింతూరు, రంపచోడవరం అటవీ డివిజన్లలో గత రెండు, మూడేళ్లుగా పులుల సంచారం నమోదు అవుతోంది.
• ప్రత్యేక రక్షణ చర్యలు: గత ఆరు నెలలుగా ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చిన ఒక పులి ఏలూరు, పోలవరం మరియు రంపచోడవరం పరిసర ప్రాంతాలలో సంచరిస్తోంది.
అత్యాధునిక సాంకేతికతతో అటవీ శాఖ సన్నద్ధత: సంచరిస్తున్న పులి వల్ల ఇప్పటివరకు ప్రజలకు ఎలాంటి హాని జరగనప్పటికీ, అది జనావాసాల్లోకి వచ్చినప్పుడు దానిని పట్టుకుని, సురక్షితంగా అడవిలోకి పంపడానికి అటవీ శాఖ అధికారులు సంపూర్ణ సన్నద్ధతతో ఉన్నారు.
• ప్రత్యేక బృందాలు: పులిని సురక్షితంగా బంధించేందుకు ట్ర్యాంక్విలైజింగ్ బృందాలు, ప్రత్యేక కేజ్లు సిద్ధంగా ఉంచారు.
• నిపుణుల సలహాలు: పుణే, తడోబా ప్రాంతాల నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణుల సేవలను కూడా అటవీ శాఖ వినియోగించుకుంటోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన “హనుమాన్” (మానవులు- జంతువుల సంఘర్షణ యాజమాన్యం) ముఖ్యమైన కార్యక్రమంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జంతువుల కదలికలను ట్రాక్ చేయడం, గ్రామాల వద్ద ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, అత్యవసర సేవలను అందించడం వంటి చర్యలు అమలులో ఉన్నాయి.
పులి వంటి వన్యప్రాణులకు గాయమైతే అటవీ శాఖ బృందం వెంటనే స్పందిస్తుంది. ట్రాంక్విలైజర్ ద్వారా జంతువును సురక్షితంగా నియంత్రణలోకి తీసుకుని, వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తారు. అనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత వాటిని తిరిగి సహజ నివాసంలోకి విడుదల చేస్తారు.
పులులను కాపాడడం అంటే కేవలం ఒక జంతువును రక్షించడం మాత్రమే కాదు. అది ప్రకృతి సమతుల్యతను కాపాడే మహత్తర బాధ్యత. పులులు మన పర్యావరణానికి ప్రతీకలు. వాటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్య

More Stories
ఉక్రెయిన్ నౌకపై క్షిపణి దాడిలో ప్రాణాపాయంలో 13 మంది భారతీయులు
హింసకు పాల్పడిన వారికి చర్యలు తీసికోమనే హామీ వర్తింపదు!
రూ 98 లక్షల సబ్సిడీని తిరిగి చెల్లించిన వ్యవసాయ మంత్రి చౌదరి