రూ 98 లక్షల సబ్సిడీని తిరిగి చెల్లించిన వ్యవసాయ మంత్రి చౌదరి 

రూ 98 లక్షల సబ్సిడీని తిరిగి చెల్లించిన వ్యవసాయ మంత్రి చౌదరి 
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ చౌదరి, తన సొంత మంత్రిత్వ శాఖ నుండే పొందిన రూ. 99 లక్షల సబ్సిడీ మొత్తాన్ని తిరిగి చెల్లించారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. చౌదరి తన దోసకాయ సాగు కోసం ఈ రాయితీని పొందడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆయన సంబంధిత బ్యాంకుకు ఆ రాయితీ మొత్తాన్ని తిరిగి చెల్లించి,  ఆ డబ్బును నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ కు తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించారు.
 
“ఈ పథకం కింద పొందిన రాయితీని సంబంధిత బ్యాంకుకు తిరిగి చెల్లించినట్లు శ్రీ భగీరథ్ చౌదరి తెలియజేశారు. ఆ రాయితీ మొత్తాన్నిఎన్ హెచ్ బికి తిరిగి ఇవ్వాలని సంబంధిత బ్యాంకును ఆదేశించడం జరిగింది,” అని కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. తన సొంత మంత్రిత్వ శాఖనే తనకు రూ. 99 లక్షల రాయితీని మంజూరు చేసిందన్న మీడియా కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ కథనంపై స్పందిస్తూ, తాను చిన్నప్పటి నుంచీ రైతునని, అర్హులైన వేలాది మంది ఇతర రైతుల మాదిరిగానే తాను కూడా ఈ రాయితీని పొందానని చౌదరి గత నెలలో పేర్కొన్నారు. “నేను రైతును, చిన్నప్పటి నుంచీ వ్యవసాయంలో ఉన్నాను… నేను ఏమీ దాచలేదు. వేలాది మంది రైతులు పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకుని రాయితీలు పొందుతుంటారు. కాబట్టి, నేను కూడా అలాగే చేశాను” అని తెలిపారు. 
 
“నేను 2018లో దరఖాస్తు చేసుకున్నాను. అక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేసి, నేను తీసుకున్న రుణాలు , రాయితీల వివరాలన్నీ అందులో పొందుపరిచాను. అక్కడ రైతులకు కొత్త పద్ధతులు, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కూడా ఇస్తుంటాను. స్థానిక అధికారులందరూ ఆ ప్రదేశాన్ని సందర్శించారు. కాబట్టి, నేను దాచింది ఏముంది?…” అని ఆయన ప్రశ్నించారు. 
 
కేంద్ర ప్రభుత్వ మంత్రుల జవాబుదారీతనంపై నిశిత పరిశీలన జరుగుతున్న తరుణంలో మంత్రి ఈ రాయితీ మొత్తాన్ని తిరిగి చెల్లించడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో, పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు చేపట్టిన భారీ నిరసనల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
ఇలా ఉండగా, రాజస్థాన్‌లోని జలోర్ నియోజకవర్గానికి చెందిన మరో బీజేపీ ఎంపీ లుంబారామ్ చౌదరి, గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యానవన సాగు పథకం కింద ఆర్థిక సహాయం పొందారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ ఒక లిఖితపూర్వక సమాధానంలో, “లుంబా రామ్ (ఎంపీ, సిరోహి, రాజస్థాన్)” 2025లో ఈ రాయితీని పొందారని పేర్కొన్నారు.
 
 ‘ఉద్యానవన పంటల ఉత్పత్తి, కోత అనంతర నిర్వహణ ద్వారా వాణిజ్య ఉద్యానవన సాగు అభివృద్ధి’ అనే పథకం కింద ఆయన ఈ సహాయాన్ని పొందారు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా వదేలి గ్రామంలో ఉన్న తన 6 ఎకరాల పొలంలో నిమ్మ సాగు కోసం ఆయన రూ. 4.20 లక్షల రాయితీని పొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2021లో లుంబారామ్ రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆయన ఎంపీగా లేరు. ఆయన 2024లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ రాయితీ డిసెంబర్ 2024లో ఆమోదం పొంది, జనవరి 2025లో విడుదల అయింది.