పాక్ బలగాల అమానుష చర్యలో పీఓకేలో 20 మంది మృతి

పాక్ బలగాల అమానుష చర్యలో పీఓకేలో 20 మంది మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జాక్) నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ సందర్భంగా కనీసం 20 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ఈ ప్రాంతంలో షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన కఠినమైన అణచివేత చర్యల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.  
మృతులలో ఎన్నికలను బహిష్కరిస్తున్నజాక్ కోర్ కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఉమర్ నజీర్ కాశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నారు. వీరితో అనే 5న నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి జరిగిన మృతుల సంఖ్య 80కు పెరిగింది. రహదారులను మూసేసి, భారీగా బలగాలను మోహరించి, లాంగ్ మార్చ్‌ను ప్రభుత్వం బలవంతంగా అడ్డుకుంది.
“లాంగ్ మార్చ్ కాన్వాయ్‌లు రావాలాకోట్ నగరానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, మరణించిన 19 మంది వివరాలు నిర్ధారించారు. మరొక వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు.  అతను తలలో బుల్లెట్ గాయంతో మరణించాడు. అతని మృతదేహం పాలంద్రి ఆసుపత్రిలో ఉంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య కనీసం 20కి చేరింది. మిగిలిన వివరాలు పగలు వచ్చాక, సమాచార వ్యవస్థ పునరుద్ధరించాక తెలుస్తాయి,” అని మంగళవారం జాక్ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది.
 
అంతేకాకుండా, నిరసనకారులు రావాలాకోట్ నగరంలోని చాందినీ చౌక్ వద్ద ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. “పగలు వచ్చాక షహీద్ చౌక్ వద్ద సమావేశం నిర్వహిస్తాం. అక్కడ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం,” అని అది జోడించింది. జాక్, పాకిస్థాన్ అధికారుల మధ్య చర్చలు పరస్పర ఆమోదయోగ్యమైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ మార్చ్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఇది ఆదివారం మీర్పూర్ డివిజన్ నుండి ప్రారంభమైందని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కాన్వాయ్‌లు రావాలాకోట్ వద్ద సమావేశమై, సోమవారం ముజఫరాబాద్ వైపు తమ యాత్రను కొనసాగించాయని సమాచారం. “మిత్రులారా, పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రావాలాకోట్ ప్రాంతం మృతదేహాలు, గాయపడిన వారితో నిండిపోయింది. దేవుడి సాక్షిగా, ఇప్పుడే మాకు అండగా నిలవండి. దయచేసి మాకు మద్దతుగా నిలవండి,” అని పీఓకేకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకీల్ భాయ్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.
 
పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల ‘యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ’ (యుకెపిఎన్పి) అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అనేక నివేదికలను ఉటంకిస్తూ, సోమవారం సాయంత్రం రావాలాకోట్‌లో శాంతియుత నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా దళాలు కాల్పులు, భారీ షెల్లింగ్, బాష్పవాయువు ప్రయోగం. ఇతర బలప్రయోగ పద్ధతులతో హింసాత్మక అణచివేత చర్యలకు పాల్పడ్డాయని ఆ సంస్థ ఆరోపించింది.
 
సోమవారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో, పీఓకే అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ఇస్లామాబాద్ 14,000 మందికి పైగా సాయుధ భద్రతా సిబ్బందిని పంపింది. పలుచోట్ల స్నైపర్లను మోహరించగా, నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు నిజమైన తూటాలు, సుదూర టియర్ గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించాయని ఆరోపణలు వచ్చాయి. 
 
గత కొన్ని వారాలుగా నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో అసమ్మతిని అణచివేసే చర్యగా, ఎన్నికలను బహిష్కరిస్తున్న వారిపై కాల్పులు జరపాలని భద్రతా దళాలను ఆదేశించారు. పీఓకేలోని 45 పోటీ స్థానాలకు ఎన్నికలు ఆగస్టు 10 వరకు మూడు దశల్లో జరగనున్నాయి. పీఓకే శాసనసభలో 53 స్థానాలు ఉండగా, వాటిలో 45 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన ఎనిమిది స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత పెద్దల కోసం రిజర్వ్ చేశారు. 
 
మీర్‌పూర్ డివిజన్‌లోని 13 నియోజకవర్గాల్లో జూలై 27న పోలింగ్ జరిగింది. ముజఫరాబాద్ డివిజన్‌లోని తొమ్మిది నియోజకవర్గాలతో పాటు మొత్తం 12 శరణార్థి నియోజకవర్గాల్లో ఆగస్టు 2న, పూంచ్ డివిజన్‌లోని 11 నియోజకవర్గాల్లో ఆగస్టు 10న పోలింగ్ జరగనుంది.