నేటి యువత తప్పుదోవ పట్టలేదని లేదా వారికి దిశానిర్దేశం లేదన్న భావన సరికాదని స్పష్టం చేస్తూ వారిని అర్థం చేసుకోవడానికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా, అర్థవంతమైన ‘చర్చ’ జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో విద్యార్థుల నేతృత్వంలో భారీ నిరసనలు జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఢిల్లీలో ‘విశ్వ మాంగళ్య సభ’ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్, తరాల మధ్య పెరుగుతున్న అంతరం గురించి ప్రస్తావిస్తూ, నేటి యువతకు సరైన మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు. “మేము చిన్నప్పుడు ఉన్న కాలం పెద్దల మాటను శిరసావహించే కాలం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు,” అని ఆయన గుర్తు చేశారు.
నేటి యువత ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే తల్లిదండ్రులు, పెద్దలు వారితో మమేకం కావడం చాలా అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారు.
అదే సమయంలో, కుటుంబాల మధ్య సంభాషణలకు తగ్గుతున్న అవకాశాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది. మనం వారికి తగిన కారణాలను వివరించాలి. వారికి ఎంతో ప్రేమను పంచాలి. వారితో సమయం గడపాలి. వారితో సంభాషించాలి,” అని భగవత్ పేర్కొన్నారు. యువత విశ్వాసాన్ని పొందాలంటే ఆదేశాలు కాకుండా సంభాషణ అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
“కొత్త తరానికి మనం ‘మనవారమనే’ భావనను కల్పించాలి. మనం వారితో సంభాషించాలి. ఆదేశాలు కాదు, చర్చ జరగాలి. ఆజ్ఞలు కాదు, ఏకాభిప్రాయం ముఖ్యం,” అని భగవత్ హితవు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన గురించి భగవత్ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చేసిన సమయం ఆ విషయాన్నే సూచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మరోవంక, శుక్రవారం నాడు, సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ నిరసనల వెనుక దేశీయ, అంతర్జాతీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. “భారతదేశం అభివృద్ధి చెందిన, బలమైన, విద్యావంతుల దేశంగా ఎదగడాన్ని కోరుకోని శక్తులే ఈ నిరసనల వెనుక ఉన్నాయి,” అని కుమార్ పేర్కొన్నారు.

More Stories
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్
లడఖ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఆర్టికల్ 371 సవరణ!
భారత్ అమ్ములపొదిలో 190 అణు వార్హెడ్లు