బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ (76) తన అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు మహ్మద్ షహబుద్దిన్ వెల్లడించారు. మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారుడిగా మహ్మద్ షహబుద్దిన్‌కు పేరుంది.
ప్రస్తుత తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రభుత్వంలో షహబుద్దిన్ ఇమడలేకే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ తన పదవికి రాజీనామా చేశారని బంగాభవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. షహబుద్దిన్ తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మేజర్ (రిటైర్డ్) హఫీజ్ ఉద్దీన్ అహ్మద్‌కు సమర్పించినట్లు తెలిపింది.
తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని పార్లమెంట్‌కు సమర్పించిన రాజీనామా లేఖలో మహ్మద్ షహబుద్దిన్ పేర్కొన్నారు. తనకు గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. గతంలో తన గుండెకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో ఆటోనామిక్ న్యూరోపతి అనే సమస్య ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా అప్పుడప్పుడు తాను కాసేపు స్పృహ కోల్పోతుంటానని స్పష్టం చేశారు.
ఈ అనారోగ్య సమస్యల వల్ల కలిగిన శారీరక, మానసిక అసమర్థత కారణంగా అధ్యక్ష పదవీ బాధ్యతలను నిర్వర్తించడం ఇక తనకు సాధ్యం కాదని చెప్పారు. తనకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) నిబంధనల ప్రకారం తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి జాతీయ పార్లమెంట్ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అందుకు 90 రోజుల గడువు ఉంటుంది.
బ్యాంకాక్‌లో వైద్య చికిత్స పొందుతూ తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని శుక్రవారం ఢాకాకు తిరిగి వచ్చిన స్పీకర్ అహ్మద్, అధ్యక్షుడి రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడి ఎన్నికలో పార్లమెంట్ స్పీకర్ కీలక బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో బీఎన్‌పీకి మెజారిటీ ఉండటంతో కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

More Stories
కామన్వెల్త్ క్రీడల ప్రారంభంకు ముందే భారత్ కు తొలి పతకం
వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు
VIDEO: కాక్రోచ్ ఆందోళనలకు విదేశీ ఫండింగ్!