నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జంతర్ మంతర్ ప్రాంతంలో జరుగుతున్న నిరసనల సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమవుతున్నారు. నిందితులపై చట్టపరమైన , పరిపాలనాపరమైన చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, హింసలో పాల్గొన్నట్లు గుర్తించిన వ్యక్తులపై సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద చర్యలు తీసుకుంటారు.
అంతేకాకుండా, ఈ అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేసే ప్రక్రియను కూడా పోలీసులు ప్రారంభించనున్నారు. హింసకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు చేపట్టిన విస్తృత చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జంతర్ మంతర్ సమీపంలో జరిగిన రాళ్ల దాడిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిబి) వివేక్ భగత్ తలకు గాయాలు కావడం, ఒంటిపై పలు చోట్ల దెబ్బలు తగలడంతో ఈ నిర్ణయం వెలువడింది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, నిరసన సమయంలో అల్లర్లు, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు సిసిటివి ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక ఆధారాలను వినియోగిస్తున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే ముందు, హింసాత్మక సంఘటనలలో పాల్గొన్న వారి గుర్తింపును నిర్ధారించడం ఈ ప్రక్రియ ఉద్దేశమని వారు తెలిపారు.
ఈ చర్య అమలైతే, నిరసన సమయంలో చెలరేగిన హింసకు సంబంధించి ఇప్పటికే నమోదైన క్రిమినల్ కేసులకు ఇది అదనంగా ఉంటుంది. దర్యాప్తులో భాగంగా నిఘా కెమెరాల ఫుటేజ్, వివిధ వనరుల నుండి సేకరించిన వీడియోలను పోలీసులు విశ్లేషిస్తూనే ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తులో సేకరించిన డిజిటల్ సామాగ్రితో సహా ఇతర సాంకేతిక ఆధారాలపై కూడా దర్యాప్తు అధికారులు ఆధారపడుతున్నారని అధికారులు తెలిపారు.
మరోవంక, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎనఎస్ఏ), 1980 కింద అధికారాలను వినియోగించుకునేలా పోలీస్ కమిషనర్‌కు అనుమతినిచ్చింది. దీనివల్ల ముందస్తు నిర్బంధం ఆదేశాలు జారీ చేసే పోలీసుల అధికారం గణనీయంగా విస్తరించింది. రాష్ట్ర భద్రతకు, శాంతిభద్రతల నిర్వహణకు లేదా అత్యవసర సరఫరాలు మరియు సేవల నిర్వహణకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని భావించే వ్యక్తులను, తక్షణ క్రిమినల్ విచారణ లేకుండానే నిర్బంధించే అధికారాన్నిఎన్ఎస్ఏ అధికారులకు కల్పిస్తుంది.
చట్టం ప్రకారం కల్పించిన రక్షణ చర్యలకు లోబడి, నిర్దిష్ట కాలం పాటు అటువంటి నిర్బంధం కొనసాగవచ్చు. విద్యార్థుల ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.దీనితో పాటు సెంట్రల్ ఢిల్లీ అంతటా పోలీసులు నిఘా, అమలు చర్యలను ముమ్మరం చేశారు. నిరసన ప్రాంతంలోని కొన్ని భాగాలలో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే నిలిపివేశారు. అదే సమయంలో జూలై 22న మొబైల్ కమ్యూనికేషన్‌పై ఆంక్షలు విధించారు.
ప్రధాన ప్రదేశాల చుట్టూ బహుళ అంచెల బారికేడ్లు, భద్రతా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిరసనకారులను పర్యవేక్షించడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన సీసీటీవీ కెమెరాలను కూడా మోహరించారు. జూలై 20న జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన సందర్భంగా జరిగిన హింసలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించడానికి, దర్యాప్తు అధికారులు పోలీసుల ఏఐ-సామర్థ్యం గల సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్ ద్వారా రికార్డ్ అయిన ఫుటేజ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 20 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలోని ఒక్కో బృందం ఒక్కో అంశాన్ని నిర్వహిస్తోంది. కొన్ని బృందాలు సోషల్ మీడియా కార్యకలాపాలు, డిజిటల్ కమ్యూనికేషన్‌లను విశ్లేషిస్తుండగా, మరికొన్ని బృందాలు అనుమానితులను గుర్తించడానికి కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్), మొబైల్ డంప్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఇన్‌పుట్‌లను పరిశీలిస్తున్నాయి.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థ, న్యూఢిల్లీ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విస్తృతమైన సీసీటీవీ నెట్‌వర్క్ నుండి ఫుటేజ్‌ను విశ్లేషించి, సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించి, హింసలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తిస్తోంది. ఇప్పటివరకు, నిరసనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 10 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. పోలీసుల ప్రకారం, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు, కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో మూడు, మందిర్ మార్గ్, బారాఖంబా రోడ్, కర్తవ్య పాత్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
కాగా, నీట్-యూజీ 2026 పేపర్ లీక్‌పై విద్యార్థులు చేపట్టిన భారీ నిరసనల విషయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొంది: “మా విద్యార్థుల బాధను, ఆందోళనను మేము చూస్తున్నాము. స్వార్థపరులు వారి భయాలను తగ్గించడానికి బదులుగా వాటిని తమకు అనుకూలంగా వాడుకోవడం దురదృష్టకరం. పరిస్థితిని శాంతపరిచి, వారి ఆందోళనను తగ్గించడమే ప్రస్తుత అవసరం. తద్వారా వారు తమ చదువులు, భవిష్యత్తు వంటి నిజంగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టగలరు.”

More Stories
మోదీ లక్ష్యంగా పాక్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఆయుధంగా సీజేపీ నిరసనలు!
పరీక్షల లీక్‌ల కోసం కఠినమైన కొత్త చట్టం.. ప్రధాని హామీ
గ్లాస్గో కామన్వెల్త్ లో 9 క్రీడల తొలగింపుతో భారత్ కు ఆశాభంగం!