ప్రధాని ఇంటి వద్ద రాహుల్ నిరసన `నిజాయతి లేనిది’

ప్రధాని ఇంటి వద్ద రాహుల్ నిరసన `నిజాయతి లేనిది’
 
తప్పుబట్టిన వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనపై, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో అనూహ్యమైన విమర్శలు చేశారు. ఈ నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, పలువురు సీనియర్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షలో భాగంగా, నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారంలో ముందుండి నడిపిస్తున్న ఆంగ్మో, జూలై 21న కాంగ్రెస్ చేపట్టిన ప్రదర్శనను “నిజాయితీ లేనిది”గా అభివర్ణించారు.  దానికి బదులుగా పార్టీ నాయకులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులకు అండగా నిలవాల్సిందని ఆమె హితవు చెప్పారు. 
 
ఇండియా టుడేతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం వాంగ్‌చుక్‌ను, ఆయన విశ్వసనీయతను రాజకీయ నాయకులు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆంగ్మో ఆరోపించారు. ప్రజలు ఇకపై తప్పుదోవ పట్టడానికి సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేశారు.  గత వారం జంతర్ మంతర్ నిరసన స్థలం నుంచి ఆసుపత్రికి తరలించిన వాంగ్‌చుక్, తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. 
 
శుక్రవారం నాటికి ఈ దీక్ష 27వ రోజుకు చేరుకుంది. “ప్రధానమంత్రి నివాసం బయట జరిగిన నిరసనలో చిత్తశుద్ధి లోపించింది. ప్రజలను ఇకపై మోసం చేయలేరు. ఇది మేల్కొన్న భారతదేశం. చిత్తశుద్ధి లేని వారిని యువత తరిమివేస్తుంది,” అని ఆంగ్మో హెచ్చరించారు. 
 
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల అణచివేతకు నిరసనగా రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నివాసం సమీపంలో ధర్నా చేసిన కొద్ది రోజులకే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసన ప్రదేశం నుంచి బలవంతంగా తొలగించిన తర్వాత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాటలో ఆయనకు ముక్కు నుంచి రక్తం కారినట్లు సమాచారం.  
 
కాక్‌రోచ్  జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని ఈ విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా ఉందని, కేవలం ప్రతీకాత్మక చర్యలు ఇకపై సరిపోవనే స్పష్టమైన సందేశాన్ని పంపడమే దీని ఉద్దేశ్యమని ఆంగ్మో నొక్కి చెప్పారు.
 
“ప్రతి రాజకీయ నాయకుడికి తాము చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఈ ఉద్యమం చూపించింది. వారు ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించలేరు లేదా నిష్కపటంగా ఉండలేరు,” అని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఈ ఆందోళనతో తమను తాము ముడిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది రాజకీయాలకు అతీతంగానే ఉందని ఆమె పునరుద్ఘాటించారు.