ప్రపంచ అశాంతి నడుమ మానవాళికి భారత్ మార్గదర్శనం

ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెరుగుతున్న తరుణంలో, మానవాళికి సరైన దిశానిర్దేశం చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబాలే స్పష్టం చేశారు. హిందూ సమాజం స్వయం సమృద్ధిని సాధించాలని, బలహీన వర్గాలకు అండగా నిలవాలని, ఐక్యంగా ఉండాలని, సమాజంలో విభజనలు సృష్టించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
మధురలోని బృందావనంలో ఉన్న కేశవ ధామ్‌లో జరిగిన ‘గిరిరాజ్ పూజ’, ‘అన్నకూట్ ప్రసాదం’ కార్యక్రమంలో పాల్గొంటూ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ద్వేషం, దురభిప్రాయాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొంది. అరాచకం విస్తరిస్తోంది. ప్రజలు పాత వ్యవస్థలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, నియంత్రణ కోల్పోతున్నారు. జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు. 
 
“మొత్తం మానవాళికి మార్గదర్శకత్వం వహిస్తూ, సరైన దిశలో నడిపించగల శక్తి ఒకరికి అవసరం. మానవాళికి అటువంటి దిశానిర్దేశం చేసేవారు కావాలి. ఈ పరిస్థితుల్లో, అలా చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక దేశం, ఏకైక సమాజం భారత్ మాత్రమే” అని హోసబాలే తెలిపారు. సమాజంలో విభజనలు సృష్టించాలని మాట్లాడేవారు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే అలా చేస్తున్నారని ఆయన చెప్పారు.
 
“అటువంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మనమంతా సంఘటితంగా, అప్రమత్తంగా ఉంటే, సమాజంలో చిచ్చు పెట్టి ముక్కలు చేయాలనుకునే వారికి ఎటువంటి అవకాశం దక్కదు. వారి తప్పుడు వాదనలు కూడా ఎక్కువ కాలం నిలవవు” అని ఆయన పేర్కొంటూ, సమాజాన్ని ఐక్యంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 
 
ఆర్థిక కోణంలో 21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా అభివర్ణించే ఆర్థికవేత్తల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇది ఒక సానుకూల పరిణామమని హోసబాలే చెప్పారు.  అయితే, కేవలం భౌతిక సంపదతో కూడిన దేశాన్ని నిర్మించడం మాత్రమే మన లక్ష్యం కాకూడదని ఆయన స్పష్టం చేశారు. “మన సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలంటే, భారతీయ జీవనశైలిని చూసి ప్రపంచం నేర్చుకోవాలి. కళలు, సంస్కృతి, ఆలోచనలు, అవగాహనల ద్వారా ‘ధర్మం’తో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో, ఉనికిలో ఆనందాన్ని ఎలా పొందాలో ప్రపంచానికి తెలియాలి” అని ఆయన తెలిపారు. 
 
భారతీయ రుషులు, సాధువులు, తపస్వులు ఇతర దేశాలకు ప్రయాణించి, మన సంస్కృతిని, నాగరికతను పంచుకోవడం వల్లే ఒకప్పుడు ప్రపంచం భారత్‌ను ‘విశ్వగురువు’గా గౌరవించిందని హోసబాలే గుర్తు చేశారు. ఆ కాలంలోని సంపన్న రాజులు, చక్రవర్తులు కూడా ఇదే విధంగా ప్రవర్తించారని ఆయన చెప్పారు. ట్రినిడాడ్‌ను ఉదాహరణగా చూపుతూ, భారతీయ నాగరికత, సంస్కృతిచే ప్రభావితమైన స్థానికులు దీపావళి వంటి పండుగలను భారతీయ సమాజంతో కలిసి జరుపుకుంటారని, ఒక పట్టణానికి ‘దీపావళి నగర్’ అని కూడా పేరు పెట్టారని ఆయన చెప్పారు. 
 
దీనికి భిన్నంగా, కొన్ని ప్రభుత్వాలు ఇతర దేశాలను ఆక్రమించుకుని, అక్కడి ప్రజలను దోపిడీ చేసి, తమ స్వంత శ్రేయస్సు కోసం వారి వనరులను స్వాధీనం చేసుకున్నాయని హోసబాలే గుర్తు చేశారు. కొలంబస్, వాస్కో డా గామా వంటి యాత్రికులు తాము వెళ్లిన ప్రతిచోటా స్థానిక ప్రజలను అణచివేసి, బలవంతంగా తమ పాలనను స్థాపించారని కూడా ఆయన తెలిపారు. శ్రీరాముని గురించి ప్రస్తావిస్తూ, “ఆయన నలుగురు సోదరులలో ఒకరు. లంకను జయించిన తర్వాత, దాని పరిపాలనను తన సొంత సోదరులలో ఒకరికి సులభంగా అప్పగించి ఉండవచ్చు. అలా కాకుండా, ఆయన లంక పాలకుడైన రావణుని సోదరుడైన విభీషణుడిని రాజుగా నియమించి అయోధ్యకు తిరిగి వచ్చారు” అని గుర్తు చేశారు. 
 
గోవర్ధన పూజ ప్రాముఖ్యతను వివరిస్తూ, బ్రజ ప్రజల సహాయంతో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేది సంఘటిత శక్తిని, ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని హోసబాలే తెలిపారు. “ఆయన ఇంద్రుని అహంకారాన్ని ఛేదించడమే కాకుండా, ప్రకృతికి మనంన్న రుణాన్ని గుర్తించి, తిరిగి చెల్లించాలనే పాఠాన్ని కూడా నేర్పారు,” అని ఆయన చెప్పారు. శ్రీకృష్ణుని జీవితాన్ని ఉదాహరణగా చూపుతూ, సమాజం ఐక్యంగా ఉండాలని, బలహీనులకు సహాయం చేయాలని, విభేదాలను పక్కనపెట్టి సంఘటితం కావాలని హోసబాలే పిలుపునిచ్చారు. 
 
అఖిల్ భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్, ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి, రాజ్యసభ ఎంపీ చౌదరి తేజ్‌వీర్ సింగ్,పలువురు బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు.

About The Author