2024 నీట్‌ లీక్‌ సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌

2024 నీట్‌ లీక్‌ సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌

నీట్‌ లీక్‌ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో 2024 నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అతడిపై నమోదైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.  2024లో నీట్‌ యూజీ పశ్నాపత్రం లీక్‌ కావడం నాడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నీట్‌ పేపర్‌ చోరీ చేసి పంపిణీ చేయడంపై బీహార్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. 

లీక్‌ స్కామ్‌కు ప్రధాన సూత్రధారిగా అనుమానించిన సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాతో పాటు మరికొందరు నిందితులపై కేసు నమోదు చేశారు. నాడు పరారీలో ఉన్న సంజీవ్‌ కుమార్‌తో పాటు కొందరు నిందితులను బీహర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2024 నీట్‌ లీక్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో దీని దర్యాప్తును సీబీఐకు అప్పగించారు. 

ఈ నేపథ్యంలో పాట్నా సీబీఐ కోర్టులో 45 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే నీట్‌ పేపర్‌ చోరీ లేదా పంపిణీలో సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియా ప్రమేయం ఉన్నట్లు నిరూపించే ఎటువంటి ఆధారాలు లభించలేదని సీబీఐ తెలిపింది. అందుకే ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయలేదని పేర్కొంది. ఈ మేరకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

మరోవైపు సంజీవ్‌ కుమార్‌ ఈ కేసులో బెయిల్ పొందినప్పటికీ, బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఇతర కేసులలో నిందితుడిగా ఉండటం వల్ల అతడు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగినట్లు సీబీఐ అధికారి తెలిపారు. నీట్‌ యూజీ 2024 ప్రశ్నపత్రం చోరీ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపడంతో పాటు ఈ కుట్రలో పాల్గొన్న నిందితులందరినీ గుర్తించినట్లు చెప్పారు. వారెవరూ చట్టం నుంచి తప్పించుకోకుండా సీబీఐ చూసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గత సంవత్సరం ఏప్రిల్‌లో, బీహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్  స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, పాట్నా స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన సిబ్బందితో కూడిన ఒక సంయుక్త బృందం ముఖియా అరెస్టుకు దారితీసిన దాడిని నిర్వహించింది. “అతను ఉత్తర ప్రదేశ్ నుండి నేపాల్ వరకు, రాష్ట్రాలు, సరిహద్దుల మధ్య జారుకుంటూ, నిరంతరం ప్రయాణిస్తూ ఉండేవాడు,” అని ఆ సమయంలో ఈఓయు  అదనపు డైరెక్టర్ జనరల్ నయ్యర్ హస్నైన్ ఖాన్ తెలిపారు. 
 
 ముఖియా, ఈఓయు “వ్యవస్థీకృత, వృత్తిపరమైన” అని పిలిచే ఒక అంతర్రాష్ట్ర సాల్వర్ గ్యాంగ్‌ను నడిపించాడని ఆరోపణలు ఉన్నాయి.  ముఖియా నేర చరిత్ర 1990వ దశకంలో మొదలైంది. ఆ సమయంలో అతను నలందలోని హిల్సాకు చెందిన, పేపర్ లీక్‌ల కేసులో కుప్రసిద్ధుడైన రంజీత్ డాన్ వద్ద పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. ముఖియా కుమారుడు  డాక్టర్ శివ్ కుమార్, టిఆర్ఈ-3 లీక్ కేసులో 2024లో అరెస్టు అయ్యాడు.