అమెరికాను $10 బిలియన్ల అప్పు కోరిన దాయాది దేశం

అమెరికాను  బిలియన్ల అప్పు కోరిన దాయాది దేశం
తీవ్ర ఆర్థిక ముప్పులో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునేందుకు ప్రపంచ దేశాల ముందు చేయి చాస్తోంది. విదేశీ మారక నిల్వలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడం, భారీ అప్పుల భారంతో కుదేలైన పాక్, ఇప్పుడు అమెరికాను ఆశ్రయించింది. 
 
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న అవకాశాన్ని వాడుకుంటూ, వాషింగ్టన్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 96,000 కోట్లు) ఆర్థిక సహాయాన్ని పొందేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్‌తో సమావేశమై ‘ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ’ కింద 5 ఏళ్ల కాలపరిమితితో 10 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘రోడ్-టు-మార్కెట్’ వ్యూహంలో భాగంగా పాక్‌ అమెరికా మద్దతు కోరినట్లు తెలుస్తోంది. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, బహుపాక్షిక ఫైనాన్సింగ్‌ సంస్థలపై ఆధారపడటం, అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యక్రమానికి అనుగుణంగా నిబంధనలను పాటించడం ఈ వ్యూహంలో భాగం. వాషింగ్టన్‌లోని దౌత్య వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం ఆసక్తి చూపుతుండటంతో ఈ రుణానికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ప్రోగ్రామ్‌లో ఉంది. దీనితో పాటు పన్నుల పెంపు, ఖర్చుల కోత వంటి కఠినమైన సంస్కరణలను అమలు చేస్తోంది.  మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియా నుండి పొందిన 9 బిలియన్ డాలర్ల రుణాల చెల్లింపు గడువును పాక్ పొడిగించుకోగా, సౌదీ నుండి అదనంగా మరో 3 బిలియన్ డాలర్ల కొత్త డిపాజిట్ రుణాన్ని పొందింది. 

యూఏఈకి రుణ బకాయిలు చెల్లించిన తర్వాత  జూన్‌ నెలాఖారు నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ పాకిస్థాన్‌ వద్ద 18.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే మిగిలాయి. గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ ఎగుమతులు కూడా అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6 శాతం మేర పడిపోయాయని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఈ సంక్షోభాల నడుమ పాక్ ఇప్పుడు అమెరికా సాయం కోసం ఆశగా ఎదురు చూస్తోంది.