భారతదేశం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమం (ఈ20) వల్ల దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, భూగర్భ జలాలు హరించుకుపోతున్నాయంటూ వస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తిగా `వ్యర్థాల నుంచి సంపద’ అనే పటిష్టమైన విధానంపై నడుస్తుందని స్పష్టం చేసింది.
రాజ్యసభలో సోమవారం ఒక ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్), జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ), బఫర్ స్టాక్ అవసరాలు పూర్తిగా తీర్చిన తర్వాత మిగిలిన అదనపు ధాన్యాన్నే ఇథనాల్ తయారీలో వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఇక్కడ కూడా మిగులు చక్కెర, మానవ వినియోగానికి పనికిరాని పాడైన ధాన్యం, విరిగిన బియ్యాన్ని (నూకలు) మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీంతో మార్కెట్లో రిటైల్ ధరలపైనా (ఆహార ద్రవ్యోల్బణం) ప్రభావం పడలేదని, గత సీజన్‌తో పోలిస్తే చక్కెర ధరల పెరుగుదల కూడా కేవలం 2.5 శాతం లోపే ఉందని ఉదహరించారు.
ఇథనాల్ ఉత్పత్తి వల్ల నీటి కొరత ఏర్పడకుండా కేంద్రం ఎక్కువగా నీరు అవసరమయ్యే చెరకు స్థానంలో, తక్కువ నీటితోనే పండే మొక్కజొన్న (మైజ్) వినియోగాన్ని భారీగా పెంచింది. 2021-22 లో ఇథనాల్ తయారీలో మైజ్ వాటా సున్నా శాతంగా ఉండగా, 2025-26 నాటికి అది ఏకంగా 37 శాతానికి చేరింది. అత్యాధునిక ఇథనాల్ ప్లాంట్లలో కేవలం 3 నుంచి 5 లీటర్ల ప్రాసెస్ చేసిన నీటితోనే ఒక లీటర్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ20 ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, తుప్పు పడుతున్నాయని సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదని మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా టూ వీలర్స్, 3 కోట్లకుపైగా కార్లు ఈ ఇంధనంతో ఎలాంటి బ్రేక్ డౌన్స్ లేకుండా నడుస్తున్నాయని డేటాను ఉటంకించారు. పాత వాహనాల్లో మైలేజ్ తగ్గడం అనేది కేవలం 3 నుంచి 5 శాతం వరకు మాత్రమే కనిపిస్తోందని, అది కూడా చాలా తక్కువగానేనని పేర్కొన్నారు.
మరోవైపు పెట్రోల్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్‌ను అంతకంటే ఎక్కువగా పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సురేశ్ గోపి వెల్లడించారు 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా దేశానికి సుమారు రూ. 1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతి తగ్గిందని ప్రభుత్వ గణాంకాల్ని వివరించారు. ఇంకా రైతులకు కూడా రూ. 1.66 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని మంత్రి వెల్లడించారు.

More Stories
ఎల్పీజీ స్థానంలో వంటగ్యాస్‌గా ఇథనాల్!
చెన్నై-బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు టెండర్లు
భారత్‌లో 10 శాతం పడిపోయిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు