చెన్నై-బెంగళూరు మధ్య మొత్తం 306.2 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి ముందు జరగాల్సిన పనుల కోసం టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కారిడార్‌లో ప్రస్తుతం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అవి, తమిళనాడులోని చెన్నై సెంట్రల్, పూందమల్లి, పరందూర్, అరక్కోణం.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్ణాటకలోని కోలారు, కొడినహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి.
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పరందూర్‌ను కూడా ఓ స్టేషన్‌గా ప్రతిపాదించింది. తాజాగా టెండర్ నోటిఫికేషన్లో పరందూర్‌ను భవిష్యత్తు స్టేషన్‌గా గుర్తించారు. ఈ కారిడార్ లో మూడు సొరంగాలు, మిగతా మార్గం ఎలివేటెడ్‌గా ఉండనుంది. పెరంబూర్, కొలత్తూర్, ఐసీఎఫ్, గ్రాండ్ నార్తర్న్ ట్రంక్ రోడ్డు, పాడి, చెన్నై బైపాస్, తిరువళ్లూరు హైవే, అన్ననూర్, పూందమల్లి, అరక్కోణం ఈ ఎలివేటెడ్ మార్గం సాగుతుంది.
అక్కడ నుంచి చిత్తూరు, కోలార్, కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్ మీదుగా బెంగళూరులోని బైయప్పనహళ్లి వద్ద ముగుస్తుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు వ్యయ అంచనా మొత్తం రూ.18 వేల కోట్లు. అయితే, సవరించిన అలైన్మెంట్ స్టడీ రిపోర్ట్‌ను కాంట్రాక్టర్ సమర్పించిన తర్వాత తుది వ్యయం ఖరారవుతుంది. ప్రాజెక్టు కోసం 41 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది.
చెన్నై సెంట్రల్ స్టేషన్ వద్ద 1.5 కిలోమీటర్, ఆంధ్రప్రదేశ్‌లోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని 11.8 కిలోమీటర్లు, బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 14.7 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించాలని ప్రతిపాదించారు. మొత్తం 28 కిలోమీటర్లు మేర రైలు భూగర్భంలోనే ప్రయాణిస్తాయి. ఈ కారిడార్‌ను 2035 నాటికి పూర్తి చేయాలనేది అధికారుల అంచనా.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చెన్నై నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు- చైన్నై మధ్య రైల్లో ప్రయాణానికి సుమారుగా 7 గంటల పడుతుండగా, ఈ కారిడార్‌తో 3 గంటల వరకు సమయం తగ్గనుంది. నిబంధనల ప్రకారం తొలి స్టేషన్ చెన్నై సబర్బన్ స్టేషన్‌కు పశ్చిమంగా ఏర్పాటు కానుంది. అక్కడ నుంచి చెన్నై సెంట్రల్, పక్కనే మెట్రో స్టేషన్‌కు అనుసంధానం అవుతుంది.

More Stories
ఎల్పీజీ స్థానంలో వంటగ్యాస్‌గా ఇథనాల్!
ఇథనాల్ మిశ్రమంతో ఆహార భద్రత, నీటి వనరులకు ముప్పు లేదు
భారత్‌లో 10 శాతం పడిపోయిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు